చాటింగ్‌ తెచ్చిన రగడ

Clash Between IBS Students Counseling For Both Parties Police Sent - Sakshi

శంకర్‌పల్లి: ఓ కళాశాలలో విద్యార్థుల చాటింగ్‌ వ్యవహారం గొడవలకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. అయితే జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్‌ చేశారని, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు, సైబరాబాద్‌ కమిషనర్‌కు షేర్‌ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా , శంకర్‌పల్లి మండలం, దొంతాన్‌పల్లి శివారులోని ఇక్ఫాయి (ఐబీఎస్‌) కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ఇక్ఫాయి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి, అమ్మాయి చాటింగ్‌ చేసుకున్నారు.

ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరూ తమ స్నేహితులకు విషయం చెప్పారు. రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఈ విషయం ఇరువర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్‌ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మళ్లీ గొడవ పడొద్దని రాజీ కుదిర్చి పంపారు.

అయితే.. ఓ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ పోస్టు చేశారు.దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

పాత గొడవ వైరల్‌ చేస్తున్నారు: సీఐ  
ఇక్ఫాయి కళాశాల విద్యార్థుల మధ్య ఈ నెల ఒకటో 1న గొడవ జరిగింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి.. వారి సమక్షంలోనే కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపాం. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే.. కావాలని ఎవరో విద్యార్థులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్‌ చేస్తున్నారు. వీడియోను వైరల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. 

(చదవండి: పుట్టిన ఆసుపత్రికి రూ.కోటి మంజూరు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top