జవానే 'హంతకుడు'! వీడిన బాలుడి హత్య కేసు మిస్టరీ | Boy Assassination Case Mystery Revealed | Sakshi
Sakshi News home page

జవానే 'హంతకుడు'! వీడిన బాలుడి హత్య కేసు మిస్టరీ

Jan 31 2022 4:17 AM | Updated on Jan 31 2022 9:31 AM

Boy Assassination Case Mystery Revealed - Sakshi

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మలికాగర్గ్‌

ఒంగోలు: దేశ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ సైనికుడే నరరూప రాక్షసుడిగా మారాడు. అభంశుభం తెలియని బాలుడిపై లైంగిక దాడి చేసి.. ఆపై దారుణంగా హత్య చేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు.. ప్రూఫ్‌ లేని సిమ్‌తో బెదిరింపు డ్రామాలాడాడు. చివరకు పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసే పరిస్థితి తలెత్తడంతో అర్ధరాత్రి పూట వీఆర్వో ముందు లొంగిపోయాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ నెల 22 జరిగిన బాలుడి హత్య వెనుక మిస్టరీ వీడింది. ఈ వివరాలను ఎస్పీ మలికాగర్గ్‌ ఆదివారం ఒంగోలులో మీడియాకు వెల్లడించారు.

కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన భూమా శ్రీనాథ్‌(11) ఈనెల 22న స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లి అదృశ్యమయ్యాడు. దీనిపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనాథ్‌ కోసం పోలీసులు గాలిస్తుండగా.. 25వ తేదీన కత్తులవానిపల్లి–ఇడమకల్లు గ్రామాల మధ్య ఉన్న రెడ్డి బావిలో మృతదేహం దొరికింది. శరీరానికి రాయి కట్టి ఉండటంతో.. హత్యగా నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో వారిని పక్కదారి పట్టించేందుకు నిందితుడు ఎలాంటి ప్రూఫ్‌ లేని సిమ్‌కార్డును ఉపయోగించి బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశాడు. వెంటనే రూ.50 లక్షలు ఇవ్వాలని.. లేకుంటే మరొకరిని చంపేస్తానని హెచ్చరించాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక తనను అరెస్టు చేస్తారని అర్థం చేసుకున్న దోనపాటి వెంకట ప్రశాంత్‌ (21) బాలుడ్ని తానే హత్య చేసినట్లు అంగీకరిస్తూ శనివారం అర్ధరాత్రి గ్రామ వీఆర్వో వద్ద లొంగిపోయాడు. వీఆర్వో అతడిని వెంటనే పోలీసులకు అప్పగించారు. అక్కపల్లికి చెందిన ప్రశాంత్‌ పంజాబ్‌లోని భటిండా రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. సెలవుపై ఇటీవల ఇంటికి వచ్చాడు. అశ్లీల వీడియోలు ఎక్కువగా చూసే ప్రశాంత్‌.. 22వ తేదీన స్నేహితులతో ఆడుకుంటున్న శ్రీనాథ్‌ ద్వారా కూల్‌డ్రింక్‌ తెప్పించుకున్నాడు.

అనంతరం తన బైక్‌పై ఎక్కించుకుని రెడ్డి బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలుడ్ని భయపెట్టి.. లైంగిక దాడి చేశాడు. బాలుడు పెద్దగా కేకలు వేస్తుండటంతో.. ప్రశాంత్‌ గొంతు పిసికి చంపేశాడు. మృతదేహానికి బండరాయి కట్టి బావిలో పడేశాడు. నిందితుడు వెంకట ప్రశాంత్‌పై ఐపీసీ సెక్షన్లు 364, 377, 302, 201, పోక్సో యాక్టు సెక్షన్‌ 6 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో పాల్గొన్న మార్కాపురం ఓఎస్‌డీ కె.చౌడేశ్వరి, మార్కాపురం డీఎస్పీ డాక్టర్‌ ఎం.కిషోర్‌ కుమార్, గిద్దలూరు సీఐ ఫిరోజ్‌లను ఎస్పీ మలికాగర్గ్‌ అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement