కొన్ని గంటల్లో సీఎం పర్యటన.. పేలుడు కలకలం

AP: Explosive Incident In Bhimavaram - Sakshi

భీమవరంలో ఘటన

తీవ్రంగా గాయపడ్డ ఆవు

సీఎం పర్యటన కోసం వచ్చిన బాంబు స్క్వాడ్‌ పరిశీలన

పేలింది బాంబు కాదని ప్రాథమికంగా నిర్ధారించిన ఎస్పీ

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూటౌన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి పేలుడు సంభవించింది. ఉండి రోడ్డులోని జంట కాలువల సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ పక్కన ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు బాంబుతో సంభవించిందా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం భీమవరంలో పర్యటించనుండగా.. పేలుడు సంభవించడంతో పోలీస్, అధికార యంత్రాంగాలు కలవరపడ్డాయి. సీఎం పర్యటన కోసం వచ్చిన బాంబ్‌ స్క్వా డ్‌ పేలుడు సంభవించిన ప్రాంతంలో అణువణువు తనిఖీ చేసింది. సమాచారం అందుకున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన బాంబు పేలుడు వల్ల సంభవించలేదని ఆయన ప్రాథమికంగా నిర్ధారించారు. పాత ఫ్రిజ్‌లోని గ్యాస్‌ సిలిండర్‌ లేదా ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించే ఏదైనా బ్యాటరీ వల్ల గాని పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. నిపుణులు పరీక్షల అనంతరమే దీనికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు.

ఆవు కాలు వేయడంతో..
పెట్రోల్‌ బంక్‌ పక్కన ఎంతోకాలంగా పాత ఇనుప సామాను వ్యాపారం నిర్వహిస్తున్నారు. షాపు వెనుక ఖాళీ ప్రదేశంలో పాత ఇనుప సామగ్రిని నిల్వ చేస్తుంటారు. అదే ప్రాంతంలో పచ్చిక ఉండటంతో నిత్యం ఆవులు మేత కోసం అక్కడికి వస్తుంటాయి. శుక్రవారం రాత్రి ఆవులు పచ్చగడ్డి మేస్తుండగా ఒక ఆవు గుర్తుతెలియని వస్తువుపై కాలువేయడంతో పేలుడు సంభవిం చింది. పేలుడు ధాటికి ఆవు వెనుక కాలు పూర్తిగా దెబ్బతినగా.. పొట్టభాగంలో తీవ్ర గాయమై కదలలేని స్థితిలో పడిపోయింది. పేలుడు శబ్దం చాలాదూరం వినిపించినట్టు చెబుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top