సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్‌

Published Wed, May 22 2024 5:04 AM

ఉమామహేశ్వరరావు

‘ప్రీలాంచ్‌’ బాధితులకు అన్యాయం చేశారంటూ ఉమామహేశ్వరరావుపై ఫిర్యాదులు 

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు 

హైదరాబాద్, ఏపీలో మొత్తం 11 చోట్ల దాడులు 

నగదు, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్ల గుర్తింపు

గతంలోనూ పలు వివాదాలు.. రెండుసార్లు సస్పెన్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: సెంట్ర­ల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో (సీసీ­ఎస్‌) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్‌ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్‌ చేసింది. ఆదాయానికి మించి ఆ­స్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడు­లు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమా­మ­హేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నే­హితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదా­లు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాక­ర్ల­ను గుర్తించినట్లు తెలిసింది. 

మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్రబాబు తెలిపారు. 

‘ప్రీలాంచ్‌’ నిందితులకు వత్తాసుపై ఫిర్యాదులు 
ప్రీ లాంచ్‌ ఆఫర్ల పేరుతో వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేసి నిండా ముంచిన సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ, దాని అనుబంధ సంస్థలపై అనేక కేసులు నమోదయ్యాయి. రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్న ఈ స్కామ్‌కు సంబంధించిన కేసులు అన్నీ సీసీఎస్‌కు బదిలీ అయ్యాయి. దాదాపు 50 కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు దాని బాధ్యతలు ఉమామహేశ్వరరావుకు అప్పగించారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న ఉమా మహేశ్వరరావు నిందితుల నుంచి భారీ మొత్తం డిమాండ్‌ చేసి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు వత్తాసు పలుకుతూ బాధితులకు తీవ్ర అన్యాయం చేశారనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.  

ఏపీలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు 
మంగళవారం ఉదయం అశోక్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఉమామహేశ్వరరావు ఇల్లు, నేరేడ్‌మెట్, ఎల్బీనగర్‌ల్లోని స్నేహితుల ఇళ్లు, ఆయన సోదరుడు, మామ ఇళ్ళతో సహా ఏపీలోని భీమవరం, విశాఖపట్నం, నర్సీపట్నంల్లోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఉమామహేశ్వరరావు దూరపు బంధువు దివంగత మడ్డు తమ్మునాయుడు ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన తెలంగాణ ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. తమ్మునాయుడు భార్య నుంచి వారి ఇల్లు, భూములు తదితర ఆదాయ వనరుల వివరాలు సేకరించారు.  

పత్రాలు, డైరీల్లో సందీప్‌ అనే పేరు 
దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం, 17 ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 5 ప్లాట్ల వివరాలు లభించినట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్ల విషయంలో ఉమామహేశ్వరరావు సహకరించట్లేదని, వాటిని తెరవడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు నుంచి స్వా«దీనం చేసుకున్న పత్రాలు, డైరీల్లో సందీప్‌ అనే పేరును అధికారులు గుర్తించారు. తన వెంట నిత్యం ల్యాప్‌టాప్‌ ఉంచుకునే ఉమామహేశ్వరరావు అందులో తాను ఎవరి నుంచి ఎంత తీసుకున్నరీ రాసుకున్నట్లు తెలిసింది. దీన్ని స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అందులోని వివరాలు విశ్లేషిస్తున్నారు.  

సోదాలు పర్యవేక్షించిన జేడీ సు«దీంద్రబాబు 
ఉమామహేశ్వరరావు, సందీప్‌ కలిసి అనేక చోట్ల పెట్టుబడులు పెట్టారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సందీప్‌ ఎవరు? అతడి పాత్ర ఏంటి? అనేది లోతుగా ఆరా తీస్తున్నారు. సీసీఎస్‌లోని ఉమామహేశ్వరరావు చాంబర్‌లో తనిఖీలు చేపట్టి ,ఆయన దర్యాప్తు చేసిన కేసుల వివరాలు ఆరా తీస్తున్నారు. జేడీ సుదీంద్రబాబు మంగళవారం రాత్రి అశోక్‌నగర్‌లోని ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి సోదాలను పర్యవేక్షించారు. ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని, బుధవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. 

గతంలో అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన ఉమామహేశ్వరరావు అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించి సస్పెండ్‌ అయ్యారు. విధుల్లోకి తిరిగి వచి్చన ఆయన్ను రేంజ్‌ అధికారులు సైబరాబాద్‌ కమిషనరేట్‌కు అలాట్‌ చేశారు. జవహర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుండగా ఓ నేర స్థలికి వెళ్లిన ఆయన అక్కడ ఓ మహిళ ముందు అభ్యంతరకంగా ప్రవర్తిస్తూ వివాదాస్పదుడు కావడంతో మరోసారి సస్పెండ్‌ అయ్యారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని ఉమామహేశ్వరరావు ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో సీసీఎస్‌కు వచ్చారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement