బావిలో పడి సచివాలయ ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

బావిలో పడి సచివాలయ ఉద్యోగి మృతి

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

వడమాలపేట (పుత్తూరు): మండలంలోని రామరాజుకండ్రిగ గ్రామంలో శనివారం బావిలోపడి సచివాలయ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి ఇందిరానగర్‌కు చెందిన సచివాలయ ఉద్యోగి చంద్రకుమార్‌(37) తన స్నేహితులు లక్ష్మీనారాయణ, అభిషేక్‌తో కలిసి రామరాజుకండ్రిగ గ్రామానికి వచ్చారు. ముగ్గురూ కలిసి సమీపంలోని ఓ బావి వద్దకు వెళ్లారు. అక్కడ చంద్రకుమార్‌ అదుపుతప్పి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అతనితో వచ్చిన ఇద్దరు స్నేహితులు గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు విషయం తెలిపారు. వారు అక్కడికి వెళ్లి చంద్రకుమార్‌ను వెలికి తీశారు. అతను అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఎస్‌ఐ హరీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్‌వోసీ లేకుండానే క్వారీ నిర్వహణ?

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు గ్రామ పరిధిలో క్వారీ పనులు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఎన్‌వోసీ లేకుండానే తవ్వకాలు చేపడుతున్నారని, మైనింగ్‌ శాఖ నుంచి కోడ్‌ రాక ముందే పనులు ప్రారంభించారని స్థానికులు చెబుతున్నారు. క్వారీ నిర్వహణలో బినామీల పేర్లతో పట్టాలు కట్టారని, అసలు యజమానులను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను పట్టించుకోకుండా జరుగుతున్న ఈ తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రా మస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారీ వాహనాల రాకపోకలతో ప్రజల భద్రతకు ముప్పు ఉందని అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత అధి కారులకు ఫిర్యా దులు అందినట్లు సమాచారం. పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

స్విమ్స్‌లో పలు పోస్టులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు

తిరుపతి తుడా: స్విమ్స్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగంలో ఎవాల్యూషన్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ – స్క్రీనింగ్‌ ప్రోగ్రామ్‌ – ఆన్‌ ఇంప్లిమెంటేషన్‌ రీసెర్చ్‌ ఇన్‌ తిరుపతి డిస్ట్రిక్ట్‌, ఆంధ్రప్రదేశ్‌ అనే ఎంఆర్‌సీ ప్రాజెక్టులో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టులకు ఈనెల 15వ, 16వ తేదీల్లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్సు, ఏఎన్‌ఎం, మామోగ్రాఫీ టెక్నీషియన్‌, కార్డియో వాస్క్యులర్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, పబ్లిక్‌ రిలేషన్‌న్స్‌ ఆఫీసర్‌, మెడికో సోషల్‌ వర్కర్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రైవర్‌ పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,445 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,383 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement