తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్‌సీఎస్‌ఎం) ఆవి ర్భావ దినోత్సవం పురస్కరించుకుని తిరుపతిలోని రీజినల్ సైన్స్ సెంటర్‌లో శనివారం మై సైన్స్ గ్యారేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న వయసులోనే పిల్లల్లో సైన్స్‌పై మక్కువ, జిజ్ఞాసను పెంపొందించేందుకు 3, 4, 5వ తరగతి విద్యార్థులకు అనువుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ తెలిపారు. పిల్లల్లో సహజంగా నేర్చుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుందని, వారి ఆలోచనలను ఆచరణాత్మకం చేయించడమే గ్యారేజీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా సృజనాత్మకత పెంపొందించడం, స్వయంగా ప్రయోగాలు చేసేలా, విభిన్న వస్తువులు రూపొందించేలా సైన్స్‌లోని మూల సూత్రాలను అనుభవపూర్వకంగా నేర్చుకునేలా గ్యారేజ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా ప్రతి నెలా మొదటి ఆదివారం మై సైన్స్ గ్యారేజ్‌ను నిర్వహించనున్నామని, దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సైన్స్ సెంటర్ అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో విభిన్న కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు సైన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన త్రీ వే స్లైడర్‌ను చిన్నారులతో ప్రారంభించారు.
శ్రీకాళహస్తి ఆలయ పీఆర్వో
కార్యాలయంలో రగడ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం చోటుచేసుకున్న ఘటన కల కలం రేపింది. ఆలయంలో దళారులేరని ప్రజాప్రతినిధులు చెబుతున్న నేపథ్యంలో, పీఆర్వో కార్యాలయంలోనే ఓ రాజకీయ దళారిపై దాడి జరగడం వివాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. చరణ్ అనే యువకుడు తన తల్లితో కలిసి శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన సందర్భంగా, శివ అనే అనధికారిక వ్యక్తి భక్తులకు మార్గనిర్దేశం చేస్తూ అటువైపు వెళ్లండి అంటూ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తాను స్థానికుడిని అంటూ చరణ్ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన చరణ్‌పై, శివా తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో ఆవేదనకు గురైన చరణ్, తన తల్లి సమక్షంలోనే జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆలయానికి తిరిగి వెళ్లాడు. అక్కడ పీఆర్వో కార్యాలయంలో శివా కనిపించడంతో, చరణ్ అతనిపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో అక్కడున్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ఆలయ ఈఓ బీకే వెంకటేశులు సెలవులో ఉన్నారు. చైర్మన్ ఈ విషయమై వివరణ కోరడానికి ప్రయత్నించగా తాను బయట ఉన్నానని మల్ల ఫోన్ చేస్తానంటూ దాటవేశారు.


