అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపాం చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ మాజీ సర్పంచులకు ఘన సన్మానం
కుప్పం రూరల్ : వైఎస్సార్ సీపీ తరఫున సర్పంచులుగా గెలిచి ఐదేళ్లు ప్రజాసేవ చేశారని, మీ సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. ఆయన శనివారం కుప్పం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ జగనన్న పిలుపుతో ముందుకు వచ్చి సర్పంచులుగా పోటీ చేశారని, కుప్పంలో 90 శాతం మంది సర్పంచులు గెలిచారని పేర్కొన్నారు. ఐదేళ్లు ఏ ఒక్క పొరపాటూ చేయకుండా ప్రజా సేవలో తరించారని కొనియాడారు. ఇదే స్పూర్తితో పనిచేసి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ సారి కూడా నమ్మకస్తులనే సర్పంచులు గా పోటీలో పెడతామని తెలిపారు. కూట మి ప్రభుత్వం రెండేళ్లుగా చేసింది ఏమీ లేదని ఆరోపించారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఇప్పటికీ ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. అధికారులను అడిగితే టీడీపీ నాయకులను కలవాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. కోర్టులకు వెళ్లి బిల్లులను మంజూరు చేయించుకుంటామని స్పష్టం చేశారు.


