తవణంపల్లె: ఓ యువకుడిని బ్లేడుతో గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. మూడు రోజుల క్రితం చెరువులో పడేశారు. ఈ ఘటన తవణంపల్లె మండలం, దిగువమోదలపల్లెలో చోటుచేసుకుంది. దిగువ మోదలపల్లెకు చెందిన రేవతి చిన్న కుమారుడు టి.లవకుమార్(23) ఓ ప్రయివేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ నెల ఒకటవ తేదీన బుధవారం సాయంత్రం ఇంటి దగ్గర అన్నతో మాట్లాడి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్లి ఉంటాడని భావించి ఇంట్లోని వారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బిడ్డ చెరువులో శవంగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోధించారు.
చెరువులో శవమై తేలాడు
దిగువమోదలపల్లె కొత్తచెరువులోలో శవం తేలడంతో బహిర్భూమికి వెళ్లిన వారు గుర్తించి లవకుమారై ఉంటాడని అనుమానించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. వారు తమ బిడ్డేనని గుర్తించారు. తవణంపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే శరీరం బాగా ఉబ్బిపోయి దుర్వాసన రావడంతో శవం దగ్గరకు రావడానికి కూడా ఇబ్బందిపడ్డారు. చిత్తూరు రూరల్ సీఐ భాస్కర్‌నాయుడు పర్యవేక్షణలో శవాన్ని పరిశీలించగా చెరువులోని చెట్టు దగ్గర లవకుమార్‌ను బ్లేడుతో గొంతుకోసి హత్యచేసి చెరువులో పడేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలంలో అగంతుకులు హత్యకు ఉపయోగించిన బ్లేడును, రక్తపు మరకలు చెరువు వరకు ఉండడం గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారం కిరాతకంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలను తల్లిదండ్రులు, అన్నదమ్ములను విచారించారు. ఎవరిదగ్గరా సరైన సమాచారం రాకపోవడంతో హత్య కేసును రెండు రోజుల్లో ఛేదిస్తామని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.
రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటాం
యువకుడిని గొంతుకోసి హత్య చేసి చెరువులో పడేసిన అగంతుకులను సాంకేతిక పరిజ్ఞానంతో రెండు రోజుల్లో పట్టుకుంటామని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. హత్య జరిగిన కొత్తచెరువు పరిసరాలను పరిశీలించారు. హత్య ఎలా జరిగింది.. కారణాలను కుటుంబ సభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకొని జైలుకు పంపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. లవకుమార్‌ను హత్య చేసినట్లు కేసు నమోదు చేసినట్లు చిత్తూరు రూరల్ సీఐ శ్రీధర్‌నాయుడు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


