పరిహారం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

పరిహారం ఇవ్వండి

Apr 3 2026 7:50 AM | Updated on Apr 3 2026 7:50 AM

నిర్వాసితుల రాస్తారోకో

జాతీయ రహదారి విస్తరణ పనుల నేపథ్యం

ఓవర్‌హెడ్‌ ట్యాంకు కూల్చివేతను అడ్డుకున్న గ్రామస్తులు

తిరుపతి–చైన్నె రోడ్డుపై 2 కి.మీ మేర ఆగిన వాహనాలు

ఇళ్లు కోల్పోయిన బాధితులందరూ దళితులు

ఏడాదిగా ఇంటి స్థలాలు చూపని రెవెన్యూ శాఖ

పుత్తూరు: తిరుపతి–చైన్నె జాతీయ రహదారి (205) విస్తరణ పనుల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులు గురువారం పరమేశ్వరమంగళం గ్రామం వద్ద రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై తిరుపతి–చైన్నె ఇరువైపులా రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరమేశ్వరమంగళం దళితవాడ వద్ద ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకును కూల్చడానికి ఎన్‌హెచ్‌ అధికారులు హిటాచీని తీసుకురావడంతో, గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అసలే వేసవి ప్రారంభమై తాగునీటికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకును ఎలా కూలుస్తారంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఏడాదిగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా ముందుగా మరోచోట ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణం చేపట్టిన తర్వాత పాత దాన్ని తొలగించాలని ఇప్పటికే పలుమార్లు విన్నవించామని తెలిపారు.

ట్యాంకు ఎవరు నిర్మించాలి?

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అడ్డుగా ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకును తొలగించే క్రమంలో అందుకు ప్రత్యామ్నాయంగా మరోచోట ట్యాంకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఆ ట్యాంకు నిర్మాణం ఎవరు చేపట్టాలన్న దానిపై అధికారుల్లో స్పష్టత లేదు. రోడ్డు పనులు చేడుతున్నది ఎన్‌హెచ్‌ అధికారులు కనుక వారే నిర్మించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతుండగా, లేదు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులే నిర్మించాలని ఎన్‌హెచ్‌ అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

స్థలాలు ఎందుకు చూపరు?

పరమేశ్వరమంగళం దళితవాడ, ఏఏడబ్ల్యూకు చెందిన 45 కుటుంబాల వారు తమ ఇళ్లను కోల్పోయారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా 2012లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు కేవలం ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని మాత్రం చెల్లించారు. అప్పటి నుంచి ల్యాండ్‌ కాస్ట్‌ చెల్లించలేదు. నివసించడానికి ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న ఇంటి స్థలాలను కేటాయించకపోవడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితమే తమ ఇళ్లను తొలగించినా, నేటికీ ఇంటి స్థలాలు చూపకపోవడాన్ని బాధితులు తీవ్రంగా తప్పుపట్టారు.

తహసీల్దార్‌ చొరవతో..

సంఘటనా స్థలానికి వచ్చిన తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు నిర్వాసితులతో మాట్లాడారు. ఇంటి స్థలాలను వెంటనే చూపాలంటూ వీఆర్‌ఓ లతను ఆదేశించడంతో పాటు ట్యాంకు నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని ఎన్‌హెచ్‌ అధికారులను ఆదేశించారు. దీంతో సమస్య తాత్కాలికంగా సర్దుమణిగింది. అలాగే నష్ట పరిహారం చెల్లింపుల్లో అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్‌ఐ వెంకట్‌ తన సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement