చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆరోగ్యశ్రీ సేవలు క్రమంగా దిగజారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన బకాయిల ప్రభావం చిత్తూరు జిల్లాపైనా పడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు సేవలను పరిమితం చేయగా, పూర్తిగా నిలిపివేత దిశగా పరిస్థితులు వెళ్తున్నాయి. బుధవారం ప్రారంభమైన సమ్మె గురువారం కూడా కొనసాగింది. నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు స్వస్తి పలికాయి. తద్వారా పేదలు వైద్య సేవలకు అవస్థలు పడుతున్నారు.
బకాయిల భారం
ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేవలను కొనసాగించడం ఆర్థికంగా సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు వెల్లడిస్తున్నాయి.
ఇప్పుడు సందిగ్ధం!
గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది వ్యాధులకు ఉచితంగా చికిత్సలు అందించేవారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద భరోసాగా నిలిచింది. రూ.25 లక్షల వరకు పరిమితి ఉండడంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.
సీఎంఆర్‌ఎఫ్‌పై ఆధారపడే పరిస్థితి
ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందకపోవడంతో రోగులు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్)పై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఈ నిధుల మంజూరులో సిఫార్సుల ప్రభావం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలకు ఈ నిధులు సులభంగా అందకపోవడం మరింత ఇబ్బందిగా మారుతోంది.
అప్పుల ఊబిలో పేదలు
ఆరోగ్యశ్రీ సేవలు అందకపోవడంతో అనేక మంది రోగులు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక చికిత్సల కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలకడగా కొనసాగాలంటే ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా జిల్లాల వ్యాప్తంగా గురువారం కూడా నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మె కొనసాగింది. అన్ని ఆస్పత్రులు వైద్య సేవలను బంద్‌చేసి ప్రైవేటు కేసులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాయి. చాలా మంది సమ్మెతో ఫీజులు చెల్లించి సేవలుపొందారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
సేవలకు అంతరాయం
జిల్లాలో ప్రస్తుతం 4,73,877 ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులు, 74 నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 4 ప్రభుత్వ ఆస్పత్రులు, 9 ప్రైవేటు ఆసుపత్రులు, 47 పీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలు, 7 డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు బకాయిల చెల్లింపులపై అసంతృప్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఆసుపత్రులు కొత్త కేసులు స్వీకరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. మరికొన్ని అత్యవసర సేవలకే పరిమితమవుతున్నాయి. క్యాన్సర్, గుండె, కిడ్నీ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘ఇప్పటికే చికిత్స మధ్యలో ఆగిపోతుందేమోనన్న భయం వెంటాడుతోంది. ఆరోగ్యశ్రీ లేకపోతే మా పరిస్థితి ఏమవుతుంది?’ అంటూ పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


