ప్రాణాలను హరిస్తున్న రసాయనాలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న
యజమానులు
కలుషితమవుతున్న భూగర్భజలాలు
చూసీచూడనట్లు వదిలేస్తున్న
అధికారులు
ఆందోళనబాటలో స్థానికులు
ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు ప్రాంతం నగరి. ఇక్కడ పవర్ లూమ్స్‌తోపాటు చేనేత మగ్గాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ఎక్కువ మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు సంతోషంగా సాగుతున్న వారి జీవితాలను రంగులు నాశనం చేస్తున్నాయి. తమిళనాడులో నిషేధానికి గురైన నూలు డైయింగ్ యూనిట్లు నగరి పట్టణంలో ఏర్పాటయ్యాయి. వాటి నుంచి వచ్చే విషపూరిత రసాయనాలు భూమిలో కలిసిపోయి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ విషయం తెలిసినా పాలకులు పట్టించుకోవడం లేదు. అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పట్టణ వాసులు రోగాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చింతలపట్టెడలో నీటి పారుదల కాలువలో రసాయన నీరు
నిరుపయోగంగా ఉన్న ఈటీపీ ప్లాంటు
నగరి : నగరిలో ఉన్న నేత పరిశ్రమకు అనుబంధంగా డైయింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ రాను రాను ఉత్పత్తి తగ్గిపోవడంతో పనిలేక డైయింగ్ యూనిట్లు మూతపడ్డాయి. ఇదే సమయంలో తమిళనాడులో నిషేధానికి గురైన అత్యధిక సామ ర్థ్యం కలిగిన డైయింగ్ యూనిట్ల వారు సరిహద్దులో ఉన్న నగరిపై కన్నేశారు. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం వారికి బాగా కలిసి వచ్చింది. అనుమతికి మించి సామర్థ్యం ఉన్న యూనిట్లను ఏర్పాటుచేశారు. ప్రస్తు తం 18 మిషన్ డైయింగ్ యూనిట్లు, 22 మాన్యువల్ డైయింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇవి స్థానిక పరిశ్రమల అవసరాలకంటే అనేక రెట్లు ఎక్కువ సామ ర్థ్యం కలిగినవి. వీటిలో 90 శాతం వరకు తమిళనాడుకు చెందిన ఉత్పత్తుల కోసమే పనిచేస్తున్నాయి. ఈ అంశాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ కౌన్సిల్ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నగరి పట్టణంలో రసాయనాలు వదలి సిద్ధం చేసే నూలు ఇక్కడి నుంచి సేలం, ఈ రోడ్డు వరకు సరఫరా అవుతున్నట్టు పేర్కొన్నారు.
కొరవడిన పర్యవేక్షణ
డైయింగ్ యూనిట్లకు అనుమతులు ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆపై అవి నిబంధనలను తుంగలో తొక్కుతున్నా అణువంతైనా చలించడం లేదు. దశాబ్దాల తరబడి నివాసాల మధ్య హాని కలిగించే యూనిట్లు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ చేపట్టిన తనిఖీలో తేలిన పలు అంశాలను కూడా పీసీబీ అధికారులు గుర్తించిన దాఖలాలు లేవు. ప్రజలకు హాని కలుగుతున్నా, పర్యావరణం పాడైపోతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆయా యూనిట్ల నుంచి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుండడంతో ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడంలో విఫలమౌతోంది. డైయింగ్ యూనిట్లను సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం.. అందుకు స్థలం చూపించి శంకుస్థాపన కూడా చేశాం అని చెబుతున్నా ఆచరణలో అమలుకావడం లేదు.
స్వచ్ఛత కనుమరుగు
లక్షల లీటర్ల రసాయన నీరు డైయింగ్ యూనిట్ల నుంచి బయటకు వస్తుండడంతో భూగర్భ జలాలు తాగడానికి అనువుకానివిగా మారాయి. దీనికితోడు డైయింగ్ యూనిట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండడంతో నగరిలోని భూగర్భ జలాలు స్నానానికి కూడా వీలుకాని విధంగా మారిపోయాయి. ఇప్పటికే పలువురు చర్మ, కిడ్నీ సమస్యలతోపాటు క్యాన్సర్, వెంట్రుకలు రాలిపోవడం తదితర సమస్యలతో సతమతమవుతున్నారు. తమిళనాడులో నిషేధించిన డైయింగ్ యూనిట్లను ఇక్కడ ఏర్పాటుచేయడానికి ఎందుకు అనుమతి ఇచ్చా రన్న ప్రశ్నకు సమాధానం చెప్పే నాథుడు లేడు.
బీటీఎం వీధిలో
కాలువల్లో పారుతున్న రసాయన నీరు
మూతపడిన ఎఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటు
మాన్యువల్ డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే రసాయన రంగునీటిని శుద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఎఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటును ఏర్పాటుచేశారు. దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ప్లాంటు విద్యుత్ బకాయిలను చెల్లించి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చారు. యూనిట్ల వారు మళ్లీ విద్యుత్ బకాయిలు పెట్టడం, నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో మూతబడింది. దాన్ని మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఆ ప్లాంటుకు హానికర రసాయన నీటిని పంపే మాన్యువల్ డైయింగ్ యూనిట్ల నిర్వాహకులు నీటిని కాలువల్లో వదిలేస్తున్నారు. ఆ నీరు భూమిలోకి ఇంకిపోవడంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఆ నీటిని తాగుతున్న స్థానికులు రోగాల బారిన పడుతున్నారు.
నగరిలో విచ్ఛలవిడిగా
డైయింగ్ యూనిట్లు
ఊపందుకుంటున్న రసాయన వ్యతిరేక పోరాటం
రసాయన ప్రమాదాన్ని ఇంకా ఎంతకాలం భరించాలంటూ నగరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ సమితి పేరిట ఇప్పటికే నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. పలువురు అధికారులకు వినతిపత్రాలు అందించారు. మరోవైపు ప్రజలు కూడా అధికారులను నిలదీస్తున్నారు. ఇటీవల ఏకాంబరకుప్పంలో డైయింగ్ యూనిట్ల పరిశీలనకు వెళ్లిన మున్సిపల్ కమిషనర్, అధికారులను స్థానికులు చుట్టుముట్టారు. బోర్ల నుంచి పలు రంగుల్లో నీరు వస్తోందని, దాన్ని ఎలా తాగాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలు ఉద్యమ రూపం దాల్చి ఉద్ధృతం కాకమునుపే సమస్య పరిష్కారానికి అధికారులు చొరవచూపాల్సిన అవసరం ఉంది.


