కుదేలైన మామిడి వ్యాపారం
క్యూలో నిరీక్షిస్తున్న భక్తులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ మొదలైంది. తోటలన్నీ పండ్లతో నిండిపోయాయి. రైతు ముఖంలో మాత్రం ఆనందం కనిపించడం లేదు. ఇందుకు ముందస్తు మామి డి వ్యాపారం సాగకపోవడమే. సీజన్ ప్రారంభానికి ముందే వ్యాపారులు తోటలను పరిశీలించి ఒప్పందాలు కుదుర్చుకునేవారు. రైతులకు ఇది పెద్ద భరోసాగా ఉండేది. పంట చేతికి రాకముందే కొంత డబ్బు చేతికి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్థానిక వ్యాపారులతో పాటు తమిళనాడులోని వేలూరు, కాట్పాడి, పరదరామి, గుడియాత్తం, తిరుత్తణి, క్రిష్ణగిరి తదితర ప్రాంతాలకు చెందిన కొనుగోలుదారులు కూడా వ్యాపారానికి దూరంగా ఉండడం రైతులకు పెద్ద దెబ్బగా మారింది.
ధరలు పడిపోవడమే కారణం
వ్యాపారులు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం గత ఏడాది జరిగిన చేదు అనుభవమే. గత సీజన్‌లో మామిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మార్కెట్‌లో సరఫరా ఎక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేశారు. ఫ్యాక్టరీలు కాయలను కొనుగోలు చేయడానికి ము ఖం చాటేశాయి. రైతులు కాయలను బలవంతంగా ఫ్యాక్టరీలకు అంటగట్టారు. వారు కొనుగోలుకు ముందుకు కావడంతో కాయలను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కాయలను రోడ్ల పాలు చేశారు. చాలామంది రైతులు అప్పుల పాలయ్యారు. ఈ నష్టాలను చూసిన వ్యాపారులు ఈ సారి ముందస్తు కొనుగోళ్లకు పూర్తిగా వెనక్కు తగ్గారు.
ఈ సారి ప్రశ్నార్థకమే
ఈ ఏడాది పరిస్థితి మరింత క్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సారి సుమారు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో తోతాపురి 40,024 హెక్టార్లకు గాను 4,83,981 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేశారు. అలాగే బేనీషా 6,856 హెక్టార్లకు 42,242 టన్నులు, కాదర్ 2,702 హెక్టార్లకు 18,834 టన్నులు, నీలం 5,178 హెక్టార్లకు 42,242 టన్నులు, మల్లిక 1,349 హెక్టార్లకు 10,444 టన్నులు, ఇతర రకం 3,217 హెక్టార్లకు 23,509 టన్నుల దిగుబడి ఉండవచ్చునని ముందస్తుగా గుర్తించారు. మొత్తంగా 59,326 హెక్టార్లలో మామిడి తోటలు ఉండగా సుమారు 6,21,252 టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. కాగా మే నెల నుంచి కోతలు మొదలు కానున్నాయి.
ఆసక్తి చూపని ఫ్యాక్టరీలు
గతంలో పండ్లు అమ్ముడుపోకపోయినా మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు రైతులకు కొంత ఉపశమనం కలిగించేవి. ఈ సారి అవి కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి, ఎగుమతుల మందగమనం, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో రైతులకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. పంట చేతికి వచ్చేసరికి అమ్మకం ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి. ముందస్తు బేరాలు లేవు. కొనుగోలుదారులు కనిపించడం లేదు. ధరలపై స్పష్టత లేదు. తోటల నిర్వహణ ఖర్చులు, కార్మికుల వ్యయం కలిపి రైతులపై భారంగా మారుతున్నాయి. ‘‘పండ్లు ఉన్నాయి.. కానీ కొనేవారు లేరు’’ అన్న పరిస్థితి రైతులను తీవ్ర నిరాశలోకి నెడుతోంది.
ప్రభుత్వం పట్టించుకోకుంటే
అంతే సంగతులు
ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర ప్రకటించడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, మామిడి పల్ప్ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వ డం, ఎగుమతులకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని అంటున్నారు. లేకపోతే గత ఏడాది లాగే ఈసారి కూడా భారీ నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు.
ప్రతి ఏటా రైతు పరిస్థితి దయనీయంగా మారుతోంది. పంట వస్తుందో.. లేదో.. వస్తే గిట్టుబాటు ధరలు పలుకుతాయో లేదో అన్న మీమాంశ అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా మామిడి రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారుతోంది. ఒకప్పుడు మామిడి సీజన్ ప్రారంభంలోనే తోటల వద్ద వ్యాపారుల సందడి కనిపించేది. ముందస్తు బేరాలు సాగేవి. రైతులకు లక్షల్లో అడ్వాన్సులు అందేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మామిడి తోటల ముందస్తు వ్యాపారం సాగడం లేదు. తోటల వద్దకు వచ్చే వ్యాపారులు కనిపించడం లేదు. ‘బేరాలే లేవమ్మా’ అన్న రైతుల మాటల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


