చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్, కార్పొరేట్ కార్యాలయ సీజీఎం కృష్ణారెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. తదుపరి ఇద్దరు ఈఈలకు ఎస్‌ఈలుగా పదోన్నతి లభించనుంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా ఎస్‌ఈ స్థానంపై వారిద్దరూ ముందుగానే కన్నేశారు. ఒకరు ప్రస్తుతం చిత్తూరులో పనిచేస్తుండగా, మరొకరు తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరికి చిత్తూరులో పనిచేసిన అనుభవంతో పాటు జిల్లాపై పట్టు ఉంది. దీనికి తోడు అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేశారు. ఇక ఆలస్యం చేయకుండా ఎస్‌ఈ సీటుపై వారు కర్చీఫ్ వేశారు. వారి స్థాయిలో ఎమ్మెల్యేల వద్ద లెటర్లు తెచ్చుకుని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక ఈఈ జిల్లాలోని ఎమ్మెల్యేల వద్ద లెటర్ ప్యాడ్ సిఫార్సులతో అధికారులకు సమర్పించినట్టు సమాచారం. మరో ఈఈ తనకు తిరుపతి జిల్లాలోని ఓ ఎమ్మెల్యేతో ఉన్న సాన్నిహిత్యం, చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ కుటుంబ సభ్యులతో పరిచయాలను ఇందుకోసం వాడుతున్నట్టు తెలిసింది. గతంలో తిరుపతి కేంద్రంగా ట్రాన్స్‌కో పాలన సాగేది. సర్కిల్ విభజన జరిగాక 2024 అక్టోబరులో చిత్తూరుకు ఎస్‌ఈ పోస్టుతోపాటు ఇతర విభాగాల పోస్టులు, కార్యాలయాన్ని కేటాయించారు. అప్పట్లో ఈ పోస్టుకు పలువురు పోటీపడ్డారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆయన దృష్టిలో పడాలని ప్రయత్నించారు. అన్యూహంగా పోటీలో లేని ఇస్మాయిల్ అహ్మద్ జిల్లా మొదటి ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన పదవీ కాలం 17 నెలల్లో సౌమ్యుడిగా, వివాద రహితుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడమే తప్ప ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించినట్టు ఎక్కడా ఆరోపణలు లేవు. ఆయన పదవీ కాలం మార్చి 31న ముగియనుండడంతో ఆ స్థానంలో చేరడానికి ఇద్దరు ఈఈలు పోటీ పడుతున్నారు. ఇద్దరులో ఒకరు వస్తారా..? లేదా అనుకోని అధికారిని నియమిస్తారా..? అని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం


