చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరులో ఆదివారం జిల్లా స్థాయి అండర్ 7, అండర్ 9 చదరంగం పోటీలు నిర్వహించారు. ఇందులో చిత్తూరుకు చెందిన చిన్నారులు కార్తికేయ, ఆదిత్య, అర్జున్, దర్షిత్, నివృత, నాగతన్విత ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఏపీ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఆర్.బీ ప్రసాద్ రాష్ట్ర స్థాయి విజేతల పేర్లను అధికారికంగా ప్రకటించారు. అండర్ 7 విజేతలు కార్తికేయ, ఆదిత్య ఏప్రిల్ 4, 5 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే అండర్ –9 విజేతలు అర్జున్, దర్షిత్, నివృత, నాగతన్విత ఏప్రిల్ 18, 19 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వారిని అభినందించారు. ఎస్.ఆర్ దినేష్, ఆర్బిటర్ మల్లికార్జున, సునీల్, సాయి, నెహార్, తస్లీమ్ పాల్గొన్నారు.
మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగుడు
గంగవరం: మండలంలో ఆదివారం ఒక దుండగుడు మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధిత మహిళ కథనం మేరకు.. మండలంలోని కీలపట్ల పంచాయతీ గాంధీనగర్‌కు చెందిన లక్ష్మి, ఆమె భర్త బావి దగ్గర నివాసం ఉంటున్నారు. ఆమె ఆదివారం తాగునీరు తెచ్చుకునేందుకు వ్యవసాయ బోరు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన దుండగుడు దాహంగా ఉందని నీరు ఇవ్వాలని మహిళను అడిగాడు. నీరు తాగుతున్న సమయంలో మహిళ మెడలో చైన్ లాక్కున్నేందుకు ప్రయత్నించాడు. ఆమె నిలువరించి గట్టిగా పట్టుకోవడంతో చైన్ తెగిపోయి సగ భాగం దుండుగుడు తీసుకుని వెళ్లిపోయాడు. చైన్ ధర సుమారు రూ.40 వేలు ఉంటుందని బాధితురాలు వాపోయింది. ఘటనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
శ్రీవారి దర్శనానికి 08 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,040 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,606 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.18 కోట్లు లభించాయి. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


