– ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
శివశంకర్ తోలేటి
రేణిగుంట: ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఏప్రిల్ 14వ తేదీ లోగా 25 వేల గృహాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించామని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తోలేటి పేర్కొన్నారు. రేణిగుంట పారిశ్రామికవాడలో సోలార్ పరికరాల గోడౌన్‌ను ఆదివారం సీఎండీ శివశంకర్ లోతేటి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఆమర్చేందుకు సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఏప్రిల్ 4 నుంచి 14 వరకు ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీసూర్యఘర్ ఉత్సవ్‌శ్రీ కార్యక్రమం ద్వారా సోలార్ విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ముగిసేలోగా సంస్థ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఎస్సీ,ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్‌ను అమర్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, ఇప్పటికే సంబంధిత ఏజెన్సీలను ఆదేశించామన్నారు. సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్, ఐటి) పి. అయూబ్ ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణాదేవి, ఎం.ఉమాపతి, జనరల్ మేనేజర్ వి.విజయన్, తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్రశేఖర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చిన్న రెడ్డప్ప, బాలాజీ, గంగాధర్ రెడ్డి , రేణిగుంట సెక్షన్ ఏడీ రమేష్, ఏఈ పుణ్య కోటి తదితరులు పాల్గొన్నారు.


