తల్లీబిడ్డ ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్
పుత్తూరు: భర్త వేధింపులు తాళలేక తన ఇద్దరు కుమార్తైలెన ఇ.తేజశ్రీ(7), ఇ.లాస్య(5) సహా ఆత్మహత్య చేసుకున్న వి.పద్మ(27) కేసుకు సంబంధించి నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శేఖర్‌రెడ్డి మీడియాకు తెలియజేసిన వివరాల మేరకు.. మృతురాలు పద్మ అన్న వి.తులసికార్తీక్ ఫిర్యాదు మేరకు నిందితులైన ఆమె భర్త ఇ.శివశంకర్‌రావ్(29), అత్త ఇ.పద్మావతిబాయి(50)ని బుధవారం సాయంత్రం పైడిపల్లి గ్రామంలోని నిందితుడు ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఆత్మహత్యకు దారి తీసిన వివరాల గురించి తెలియ జేస్తూ.. పుత్తూరు మండలం, పైడిపల్లి గ్రామానికి చెందిన శివశంకర్, నేసనూరు గ్రామానికి చెందిన పద్మ 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు పుత్తూరు పట్టణంలోని కృష్ణానగర్ మూడవ వీధిలో బాడుగ ఇంటిలో కాపురం పెట్టారు. వీరికి తేజశ్రీ, లాస్య అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఈ క్రమంలో శివశంకర్ ఉద్యోగానికి వెళ్లకుండా అప్పులు చేస్తూ జులాయిగా తిరుగుతూ వచ్చాడు. గత కొంత కాలంగా భర్త శివశంకర్‌తో పాటు అత్త పద్మావతి ఇద్దరూ అదనపు కట్నం కోసం పద్మను వేధింపులకు గురిచేశారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన పద్మ తన ఇద్దరు కుమార్తెలతో కలసి ఈనెల 7వ తేదీ సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకొని మృతి చెందింది. దీంతో బుధవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


