చిన్నారి పెళ్లికూతురు! | - | Sakshi
Sakshi News home page

చిన్నారి పెళ్లికూతురు!

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

చిన్నారి పెళ్లికూతురు!

చిన్నారి పెళ్లికూతురు!

కుప్పంలోనే అధికం మూడు రాష్ట్రాల కలయికే మూడు మూళ్ల బంధానికి బీజం ఏడాదిలో 2,971 టీనేజీ తల్లులు.. 92 బాల్య వివాహాలు నిలుపుదల క్షేత్ర స్థాయిలో అవగాహన లోపమే కారణమా?

కాణిపాకం: జిల్లాలో టీనేజీ వయసు దారి తప్పుతోంది. పుత్తిడి బొమ్మలు.. మూడు ముళ్ల బంధంలో చిక్కుకుపోతున్నారు. ప్రేమో.. ఆకర్షణో తెలు సుకునే సరికే బాల్యం బలవుతోంది. ఆడుకునే వయసులో అమ్మలను చేస్తోంది. కుప్పంలో ఇలా టీనేజీ గర్భవతులు అధికమతున్నారు. ఏడాది కాలంలో 2,971 మంది చిట్టి తల్లులయ్యారు. ఇదీ జిల్లాను కలవరపాటుకు గురి చేస్తోంది. క్షేత్ర స్థాయిలో అవగాహన కొరవడుతోంది.

జిల్లాలో 50 పీహెచ్‌సీలు, 15 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 2025–2026 (జనవరి వరకు)గాను 31,291 మంది గర్భ వతులు నమోదయ్యారు. వీరిలో 27,291 మంది ప్రసవించారు. అయితే ఈ ఏడాదిలో టీనేజీ గర్భవతులు 2,971 మందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. మల్లానూరు పీహెచ్‌సీలో 66, వీరాన్నమలలో 29, కొత్తపల్లిలో 61, పైపల్లిలో 67, వెంకటగిరిలో 96, రాయల్‌ పేట 57, కొలమాసనపల్లిలో 75, కంగుడిలో 36, శాంతిపురంలో 76, విజలపురంలో 40, గుడిపల్లెలో 51, రాళ్లబుదుగూరు 63, బైరెడ్డిపల్లిలో 77, మాదిరెడ్డిపల్లిలో 46, పెద్దపంజాణి 67, ఓగు పీహెచ్‌సీ పరిధిలో 92 టీనేజీ గర్భవతులు తేలారు. మరిన్ని పీహెచ్‌సీల్లో కూడా టీనేజీ గర్భవతుల సంఖ్య ఘణనీయంగా పెరిగింది.

కుప్పం..పరిసర ప్రాంతాల్లోనే అధికం

కుప్పం.. అక్కడి పరిసర ప్రాంతాలు జిల్లాకు చిట్టచివరి ప్రాంతాలు. ఈ ప్రాంతం తమిళనాడు, కర్ణాటక నడుమ ఉంటుంది. అలాగే ఇక్కడ అక్షరాస్యత తక్కువ. ఇంకా అక్కడి ప్రజలు వారి పూర్వీకుల లాగానే ఆలోచిస్తుంటారు. 10వ తర గతి చదివితే చాలు పిల్లలకు.. వెంటనే పెళ్లి ముచ్చట తీర్చి బాధ్యత వదిలించుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. అలాగే ప్రేమ మోజులో పడి చాలా మంది.. మూడు ముళ్ల బంధంలో నలిగిపోతున్నారు. అభం శుభం తెలి యని వయసులో చిట్టి తల్లులవుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాల మాయలో పడి చిన్న వయసులో బతుకు భారాన్ని మోస్తున్నారు. శారీరక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అలాగే కార్వేటినగరం, శ్రీరంగరాజుపురం, బంగారుపాళ్యం, పలమనేరు, తవణంపల్లి, యాద మరి తదితర ప్రాంతాల్లో కూడా టీనేజీ తల్లుల సంఖ్య అధికమవుతోంది. ఈ టీనేజీ పెళ్లిళ్లు మాతా శిశు మరణాలకు దారితీస్తాయి.

‘స్మార్ట్‌’ ప్రభావం ఎక్కువ

కరోనా పుణ్యమా అని పిల్లల చేతుల్లోకి స్మార్ట్‌ ఫోన్లు వచ్చాయి. విద్యాలయాలు మూసివేసి ఆన్‌న్‌లైన్‌ క్లాసుల నిర్వహణతో కేజీ నుంచి పీజీ స్థాయికి స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరైంది. కొందరు విద్యార్థులు పాఠాలు వినేందుకు వినియోగిస్తే మరికొందరు వక్రమార్గం పట్టారు. ఇప్పుడు అర చేతిలో ఇమిడే ఫోన్‌లలోనే ఆశ్లీలత చేరిపోవడంతో మానసిక పరిపక్వత చెందని వయసులోనే టీనేజీ యువతపై దాని ప్రభావం పడుతోంది. దీంతో వారు చెడు మార్గం పడుతున్నారు.

బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం పీహెచ్‌సీ పరిధిలో 13 ఏళ్ల బాలిక గర్భవతి అయింది. 20 రోజుల కిందట ఆ బాలికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పుడే గర్భవతి కావొద్దని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా తల్లిదండ్రులు తలొగ్గలేదు. చేసేది లేక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆ బాలికను హైరిస్క్‌ జాబితాలో పెట్టారు. ఆ చిట్టి తల్లిని నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు జిల్లాలో చాలానే ఉన్నాయి.

జిల్లాలో పెరుగుతున్న టీనేజీ తల్లులు

బాల్య వివాహాల కట్టడి ఏదీ?

టీనేజీ గర్భవతుల నమోదుకు.. బాల్య వివాహాల నిలుపుదల సంఖ్యకు పొంతన ఉండడం లేదు. ఈ ఏడాదిగా జిల్లాలో 2,971 టీనేజీ గర్భవతులు నమోదైతే.. బాల్యవివాహాల సంఖ్య 92 మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఇందులో 91 బాల్యవివాహాలను ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్నారు. ఒక్క కేసు నమోదు చేయించారు. కుప్పంలో 9, శాంతిపురంలో 8, పుంగనూరులో 7, పలమనేరులో 6, బంగారుపాళ్యంలో 5, గంగవరంలో 5, నగరిలో 5 చొప్పున్న గుర్తించామ ని ఐసీడీఎస్‌ అధికారులు వెల్లడిస్తున్నారు. అయి తే క్షేత్ర స్థాయి లోని ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు బాల్యవివాహాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని జిల్లా అధికారులు ఆగ్రహానికి గురవుతున్నారు. బాల్యవివాహాలను అడ్డుకునే క్రమంలో తల్లిదండ్రుల సహకారం ఉండడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, బెదరింపులు వస్తున్నాయని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement