సున్నా వడ్డీకి సున్నం
సకాలంలో రుణాలు చెల్లించినా పైసా విదల్చని సర్కారు జిల్లాలో సుమారు లక్షల మంది రైతులకు నష్టం సక్రమంగా తన వాటా ఇస్తున్న కేంద్రం 18 నెలలుగా ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో అన్నదాతలు
కార్వేటినగరం : తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు ఇస్తున్న సున్నా వడ్డీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎసురు పెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారానికి వచ్చి దాదా పు 18 నెలలకు పైగా కాలం గడిచిన ఇప్పటికీ నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో దాదాపు లక్షల మంది రైతులు నష్టపోతున్నారు..
రాయితీ ఇలా..
అన్నదాతలకు ఎంతో మేలు చేసే ఈ బృహత్తర పథకానికి 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకా రం చుట్టారు. తాను నిర్వహించిన ప్రజా ప్రస్థానం పాద యాత్రలో పంట పెట్టుబడి కోసం రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి ఆ పథకాన్ని ప్రకటించారు. అప్పటి వరకు రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను ఒక్క సంతకంతో మాఫీ చేశారు. ఆ తరువాత రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయి తీ చెల్లిస్తామని ప్రకటించారు. ఆ విధంగా రూపుదిద్దుకున్న ఈ పథకం కింద పంట రుణాలు తీసుకు న్న రైతుల నుంచి ఏడాదికి వసూలు చేసే వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం చొప్పున భరిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు ఐదేళ్లూ పూర్తి వడ్డీ రా యితీ అందించి ఎంతో మేలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అమలును పూర్తిగా విస్మరించింది.
పంట రుణాలు ఇలా..
చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీ) పరిధిలోని 40 సహకార బ్యాంకు బ్రాంచిలు,198 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా లు (సొసైటీలు) ఉన్నాయి. వీటి పరిధిలో ఒక లక్ష మందికి పైగా సభ్యులున్నారు. ప్రస్తుతం వీరికి ఏటా రూ. 500 కోట్లకు తక్కువ కాకుండా రుణాలిస్తున్నారు. డీసీసీబీతో పాటు పలు వాణిజ్య బ్యాంకులు కూడా రైతులకు కనిష్ఠంగా రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.3 లక్షల వరకూ పంట రుణాలిస్తున్నాయి. రూ.లక్ష రుణం తీసుకున్న రైతులందరికీ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టడంతో వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీల నుంచి తీసుకు న్న రుణాలకు సంబంధించి అసలుతో పాటు మొ త్తం వడ్డీని కూడా రైతులే చెల్లించాల్సిన పరిస్థితు లు నెలకొన్నాయి. క్రేంద్ర ప్రభుత్వం ఏటా రుణా లు సక్రమంగా చెల్లించే ప్రతి రైతుకు క్రమం తప్పకుండా రూ.3 వేల చొప్పున వడ్డీ రాయితీ ఇస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ. 4 వేల వడ్డీ రాయితీని 18 నెలలు గా ఇవ్వడం లేదు. ఈ విధంగా జిల్లాలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 2 కోట్ల మేర వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని సమాచారం.
ఈ పథకానికి ఎగనామం
రైతు సంక్షేమానికి దోహదపడే ఒక్కో పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెడుతోంది. ఈ క్రమంలో సున్నా వడ్డీ పథకానికి కూడా పుర్తిగా ఎగనామం పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ. 20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకానికి ఒక ఏడాది ఎగనామం పెట్టింది. రెండో ఏడాది అరకొరగా రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. అదికూడా చాలా మంది రైతులకు ఇవ్వలేదు. అలాగే ప్రకృతి వైప్యరిత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకూ పరిహారం చెల్లించ లేదు.
చెల్లించకుంటే రుణం ఎలా ?
పంటల రుణాలపై ప్రభుత్వం 18 నెలలుగా వడ్డీ రాయితీ ఇవ్వకపోవడంతో ఆ భారం రైతుల పైనే పడుతోంది. ప్రభుత్వం వడ్డీ రా యితీ విడుదల చేస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమ చేస్తామని చెబుతూ వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీలు కూడా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా రైతులు వడ్డీ చెల్లించకపోతే వారికి రుణాలిచ్చేందుకు ఆయా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో కొంత మంది రైతులు తంటాలు పడుతూ బ్యాంకుల కు వడ్డీ చెల్లిస్తున్నారు. అలా చెల్లించలేని వారు తమకు పంట రుణాలు ఏవిధంగా వస్తాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.
పునరుద్దరించాలి
ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందించేది. కానీ రెండేళ్లుగా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. బ్యాంకు అధికారుల ఒత్తిడి తెస్తుండడంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఉపయోగపడే పథకాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదు.
– మురళీకృష్ణారెడ్డి, రైతు, ముక్కరవానిపల్లి, కార్వేటినగరం మండలం
వెంటనే విడుదల చేయాలి
ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని గతేడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పి, గత ఏడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప పథకాలకు నిధులు కేటాయించకుండా ఇబ్బందులకు గురిచేస్తుంది.
– లోకనాథరెడ్డి, రైతు, అన్నూరు, కార్వేటినగరం మండలం
సున్నా వడ్డీకి సున్నం
సున్నా వడ్డీకి సున్నం


