కారును ఢీకొన్న ద్విచక్రవాహనం | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న ద్విచక్రవాహనం

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 7:41 AM

కారున

కారును ఢీకొన్న ద్విచక్రవాహనం

బంగారుపాళెం : మండలంలోని కేజీ సత్రం వద్ద ఆదివారం సాయంత్రం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో కారును బైక్‌ ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ఒక బైక్‌ పలమనేరు నుంచి చిత్తూరు వెళుతోంది. కేజీ సత్రం నుంచి వచ్చిన కారు యూటర్న్‌ తీసుకోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కారును వెనుకవైపు ఢీకొని కిందపడింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. వారిని హైవే అంబులెన్స్‌ సిబ్బంది చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మురుగు కాలువ పూడ్చివేత

గంగవరం: మురుగు నీరు ప్రవహిచే కాలువను టీడీపీ నాయకుడు స్వార్థబుద్దితో మట్టితో పూడ్చేసిన సంఘటన మండలంలోని నడిమి గొర్రెలదొడ్డి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు.. పసుపత్తూరు పంచాయతీ నడిమిగొర్రెలదొడ్డి గ్రామంలో ప్రజల సౌకర్యార్ధం గత ప్రభుత్వంలో సర్పంచ్‌ నిధులు రూ.2.5 లక్షలు వెచ్చించి మురుగు కాలువను నిర్మించారు. అది తన ఇంటి ముందు వెళ్లిందన్న స్వార్థంతో టీడీపీ నాయకుడు మట్టితో పూడ్చేశాడు. అధికార పార్టీ నాయకులు ప్రజలకు మంచి చేసి మన్ననలు పొందాల్సి ఉండగా కాలువను పూడ్చి ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని స్థానికులు విమర్శిస్తున్నారు. అడిగితే మీకు దిక్కున్నచోట చెప్పుకోండి, మీ ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు మా ఇంటి ముందు వెళ్లాలా అని దుర్భాషలాడుతున్నట్టు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

గొంతు కోసి వృద్ధురాలి హత్య

గుడుపల్లె: మండలంలోని ఓఎన్‌ కొత్తూరు గ్రామంలో ఆదివారం వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. ఓఎన్‌ కొ త్తూరు గ్రామానికి చెందిన చెందిన చిన్నక్క(64) గ్రామం చుట్టుపక్కల ఉన్న చింత చెట్ల వద్దకు వెళ్లి చింతకాయ లు ఏరుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయాన్నే గ్రామ సమీపంలోని చింతచెట్టు వద్దకు వెళ్లింది. గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతు కోసి హత్య చేశారు. అనంతరం చెవుల్లోని కమ్మలను అపహరించి మృతదేహాన్ని సమీపంలోని ఇటుకల బట్టీలో పడేసి పారిపోయారు. సాయంత్రం ఇటుకల కోసం వచ్చిన స్థానికులు వృద్ధురాలి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ పార్థసారథి, సీఐ మల్లేష్‌యాదవ్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీం ద్వారా విచారణ చేపడుతున్నారు.

ఉలిక్కిపడ్డ ఓఎన్‌ కొత్తూరు

ప్రశాంతంగా ఉండే తమిళనాడు సరిహద్దులోని ఓఎన్‌ కొత్తూరు గ్రామం చిన్నక్క హత్య ఉదంతంతో ఉలిక్కిపడింది. మహిళలు ఒంటరిగా బయటకి వెళ్లరాదంటూ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

సురక్షితంగా అడవిలోకి

జంట ఏనుగులు

చిత్తూరు కార్పొరేషన్‌ : అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్స్‌ ఆదివారం రాత్రి జంట ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించారు. ఈ డ్రైవ్‌లో పలమనేరు నుంచి 13 మంది ట్రాకర్స్‌, ఐదుగురు సిబ్బంది, చిత్తూరు నుంచి 20 మంది సిబ్బంది పాల్గొన్నారు. వారు ఏనుగుల వెనుక టపాసులు కాలుస్తూ, రాకెట్లు వదులుతూ నగర ప్రాంతం దాటించారు. మురకంబట్టు వద్ద ఏనుగులు కాసేపు వెనుతిరగడంతో వాటిని అడ్డుకట్ట వేసి ముందుకు పంపారు. అనంతరం లెనిన్‌నగర్‌ మీదుగా సీతమ్స్‌ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తరలించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా వాటిని పంపినందుకు అధికార, సిబ్బంది బృందంను డీ ఎఫ్‌ఓ సుబ్బరాజు అభినందించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వోలు పట్టాబి, థామస్‌ పాల్గొన్నారు.

పంటలపై మళ్లీ ఏనుగుల దాడి

గుడిపాల : మండలంలో ఏనుగులు మళ్లీ దాడి చేశాయి. ముత్తువాళ్లూరు, బట్టువాళ్లూరు గ్రామాల మధ్యలో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పంట పొలాలపై శనివారం రాత్రి పడ్డాయి. ఆరేళ్ల వయసున్న కొబ్బరి చెట్లను మొదలు నుంచి పెరికేశాయి. సుమారు 60 కొబ్బరి చెట్ల దాకా ధ్వంసం చేశాయి. మరోపక్క మామిడి చెట్లను కూడా ధ్వంసం చేశాయి. మామిడి పూత వస్తున్న తరుణంలో ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా అటవీశాఖ అధికారులు ఏమి చేస్తున్నారని, ప్రతిరోజూ వచ్చి డ్రైవ్‌ చేయడమే కానీ ఏనుగులను ఇతర ప్రాంతాలకు తరిమేసిన దాఖలాలు కనిపించలేదని రైతులు వాపోతున్నారు. అక్కడక్కడా అరటి పంటను కూడా ధ్వంసం చేశాయని తెలియజేశారు. ఏనుగులు పొలాల్లోకి రాకుండా ప్రత్యామ్నాయ మా ర్గాలు చూడాలని రైతులు వేడుకుంటున్నారు.

కారును ఢీకొన్న ద్విచక్రవాహనం 
1
1/1

కారును ఢీకొన్న ద్విచక్రవాహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement