మునిసిపాలిటీల్లో ఓటర్ల జాబితాలపై కసరత్తు | - | Sakshi
Sakshi News home page

మునిసిపాలిటీల్లో ఓటర్ల జాబితాలపై కసరత్తు

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 7:41 AM

మునిసిపాలిటీల్లో ఓటర్ల జాబితాలపై కసరత్తు

మునిసిపాలిటీల్లో ఓటర్ల జాబితాలపై కసరత్తు

వచ్చేనెల 9న వార్డుల వారీ జాబితా ప్రచురణ

ఆపై రిజర్వేషన్లు, ఎన్నికలపై నిర్ణయం

జిల్లాలో మార్చి 17తో ముగియనున్న కౌన్సిల్‌ కాలపరిమితి

ప్రత్యేక పాలనపైనే కూటమి సర్కారు యోచన?

చిత్తూరు అర్బన్‌ : మునిసిపల్‌ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 9వ తేదీన అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫొటో ఓటర్ల జాబితాను ప్రచురించాలని కమిషనర్‌ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు మాత్రం నిర్ణీత సమయంలో నిర్వహించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అసెంబ్లీ ఓటర్ల జాబితానే..

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితానే మార్చిలో ప్రచురించడానికి అధికారులు పనులు ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు పూర్తయి, ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారి పేర్లను సైతం జాబితాలో చేర్చనున్నారు. ప్రతి ఒక్కరీ ఫొటోతో జాబితాను వార్డుల వారీగా సిద్ధం చేసుకుని, మార్చి 9వ తేదీన ప్రచురించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. జిల్లా పునర్విభజన పూర్తయ్యాక జిల్లా పరిధిలో చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌, పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీలు ఉన్నాయి. చిత్తూరులో 50 డివిజన్లు ఉండగా, పలమనేరు మున్సిపాలిటీలో 26, నగరిలో 29, కుప్పం మునిసిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. వీటిలో కూడా వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించాలి.

రిజర్వేషన్లు కీలకం

ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత వార్డుల్లో సామాజిక వర్గాల వారీగా ఉన్న జనాభా, ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్‌ నిర్ణయిస్తారు. అలాగే రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్‌, మేయర్‌ స్థానాలు రిజర్వు చేయాల్సి ఉంది. ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరలోనే కుల గణన జరగాల్సి ఉంది. ఎన్నికలకు ముందు కుల గణన పూర్తయ్యేలా లేదు. ఇది కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశం. చైర్‌పర్సన్లు, మేయర్‌ పదవులు ఆశించే ఆశావహులకు అనుకూలంగా రిజర్వేషన్లు లేకపోతే అసమ్మతి రాగం కొంప ముంచుతుందని రిజర్వేషన్లపై కూడా ఓ నిర్ణయానికి రాకపోచ్చు.

ప్రత్యేక పాలన తప్పదా..?

జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లోని పాలక వర్గాల(కౌన్సిల్‌)కు మార్చి 17వ తేదీతో గడువు ముగియనుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బయటపడుతుందనే ఉద్దేశంతో మునిసిపల్‌ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫలితంగా కొద్ది రోజుల పాటు మునిసిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించి పాలన సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరుల నెలల పాటు ప్రత్యేక పాలన సాగించి, ఆపై ప్రభుత్వం మున్సిపోల్స్‌పై ఆలోచించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement