ఇంకేం చెప్పాలి..? మరేం రాయాలి ! | - | Sakshi
Sakshi News home page

ఇంకేం చెప్పాలి..? మరేం రాయాలి !

Feb 8 2026 4:26 AM | Updated on Feb 8 2026 4:26 AM

ఇంకేం

ఇంకేం చెప్పాలి..? మరేం రాయాలి !

సుప్రీంకోర్టు నేతృత్వంలోని సిట్‌–సీబీఐ చెప్పినా వినరా?

వైఎస్‌ జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చూపడానికే మీ తాపత్రయమా..

అమిత్‌ షా శిష్యుడు.. బీఆర్‌.నాయుడు పాలకమండలి సభ్యుడు బోరా నాడు కల్తీ నెయ్యితోనే అయోధ్యకు లడ్డూలు

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, పచ్చ పత్రికలవి దిగజారుడు రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ నేత.. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఫైర్‌

చిత్తూరు అర్బన్‌ : ‘బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సుప్రీం కోర్టు చెప్పింది. అదే సుప్రీం కోర్టు నేతృత్వంలో ఏర్పడ్డ సీబీఐ–సిట్‌ కమిటీ తొమ్మిది నెలలు విచారించి శ్రీవారి లడ్డూల్లో జంతు కొవ్వులు లేవని కోర్టుకు రాతపూర్వక నివేదిక ఇచ్చింది. ఇంకేం చెప్పాలి చంద్రబాబు నాయుడు..? మరేం రాయాలి..? మీ ప్రతిక ఒక్క మాటలో అసహనం, అభద్రత కనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హైందవ వ్యతిరేకిగా చూపిస్తూ, లడ్డూ అనే బాంబును ఆయుధంగా చేసుకుని వైఎస్సార్‌సీపీపై వేయడానికి పవన్‌ కళ్యాణ్‌, పచ్చ పత్రికలతో కలిసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు. మీకు గుణపాఠం తప్పక చెబుతారు’ అంటూ టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో శనివారం నియోజకవర్గ సమన్వయకర్త ఎంసి.విజయానందరెడ్డితో కలిసి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. సిట్‌–సీబీఐ కోర్టుకు ఇచ్చిన నివేదికలో 32 మందిని కల్తీ నెయ్యిలో బాధ్యులుగా చూపిందని, ఇందులో ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేసిందన్నారు. పైగా జంతుకొవ్వులు లేవనే విషయాన్ని కూడా ప్రస్తావించిందన్నారు. ఈ నివేదికను జీర్ణించుకోలేని చంద్రబాబు తన కుట్రలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హిందూ వ్యతిరేకిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని.. ప్రతి ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఈ అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 2019–24 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపై విచారించిన సిట్‌.. 2014–19 మధ్యలో సరఫరా చేసిన నెయ్యిపై సైతం దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటపడుతాయన్నారు. టీటీడీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘటన వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, అటుపై వైఎస్‌ జగన్‌కే సాధ్యమయ్యిందన్నారు.

చిత్తూరులో అమలు కావడం సంతోషం

జిల్లా అనుబంధ కమిటీల టాస్క్‌ఫోర్స్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను కాపాడుకోవాలని వైఎస్‌.జగన్‌ చెబుతున్న 2.0 కార్యక్రమం.. చిత్తూరులో అమలవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ 40 ఏళ్ల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు అత్యున్నత ప్రాముఖ్యం వైఎస్‌.జగన్‌ హయంలోనే జరిగిందన్నారు.

పార్లమెంటు పరిశీలకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న తప్పుల్లో సింహభాగం బాధ్యత పవన్‌ కళ్యాన్‌దేన్నారు. ఆయన నిద్రపోతున్నట్లు నటిస్తున్నారన్నారు. తన శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం రాయలసీమ ప్రాజెక్టులకు తాకట్టుపెట్టిన వ్యక్తిగా బాబు చరిత్రకెక్కారన్నారు. జెడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ.. లడ్డూల విషయంలో బాబుకు తగిన శిక్ష శ్రీవారే విధిస్తారన్నారు. పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా మారారని, వైఎస్సార్‌సీపీలో ఇక నుంచి కార్యకర్తలదే భవిష్యత్తన్నారు. గ్రామ కమిటీలు చెప్పిందే వైఎస్‌.జగన్‌ చేస్తారని, వాళ్లకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు కెపి.శ్రీధర్‌, రూరల్‌ అధ్యక్షుడు జయపాల్‌, గుడిపాల అధ్యక్షులు ప్రకాష్‌, నాయకులు చంద్రశేఖర్‌, జ్ఞానజగదీష్‌, విజయసింహారెడ్డి, పురుషోత్తంరెడ్డి, గాయత్రీదేవి, హరిణిరెడ్డి పాల్గొన్నారు.

బహిరంగ సభకు హాజరైన పార్టీ శ్రేణులు

విజయానందరెడ్డితో కలసి ప్రసంగిస్తున్న భూమన కరుణాకర రెడ్డి

కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతోందని భూమన అన్నారు. అమిత్‌ షా శిష్యుడు, ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు పాలక మండలి సభ్యుడు సౌరబ్‌ బోరా నాడు రూ.30 లక్షలు వెచ్చించి అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డూలు తీసుకెళ్లాడని, అతను లడ్డూల తయారీకి కల్తీ నెయ్యిను ఉపయోగించాడనే విషయం పవన్‌ కళ్యాణ్‌కు సైతం తెలుసన్నారు. నాలుగు రోజుల క్రితం శ్రీవారి లడ్డూల్లో జంతు కొవ్వులు లేవని, వైఎస్‌.జగన్‌కు ఇందులో సంబంధంలేని మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌.. రెండు రోజుల్లో మళ్లీ కొవ్వులు కలిపారని, జగన్‌కు సంబంధం ఉందని చెప్పడం అబద్దాలతో రాజకీయం చేయడమేనని ఆయన మండిపడ్డారు.

టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతూ..

ఇంకేం చెప్పాలి..? మరేం రాయాలి ! 1
1/1

ఇంకేం చెప్పాలి..? మరేం రాయాలి !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement