నీటి సంపులో పడి కార్మికుడి మృతి
బంగారుపాళెం : నీటిసంపులో పడి గ్రానెట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని కుప్పాలపల్లె వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పాలపల్లె సమీపంలో ఓ గ్రానెట్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన కార్మికుడు గౌతమ్(30) ఫ్యాక్టరీలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీ ఆవరణలో పనులు చేస్తూ ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న పెద్ద నీటి సంప్‌లో పడిపోయాడు. ఊపిరి ఆడక అపస్మారక స్థితిలో సంప్‌లో పడి ఉన్న గౌతమ్‌ను తోటి కార్మికులు చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టరు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలల్లో
ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమగ్రశిక్ష శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెంకటరమణ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్‌టీఈ 12(1) సి చట్టం ప్రకారం పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా ఒకటవ తరగతిలో అడ్మిషన్లు కల్పించడం జరుగుతుందన్నారు. 2026–2027 విద్యాసంవత్సరానికి గాను జిల్లాకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించడం జరిగిందన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు నివాస ప్రాంతంలో సమీపంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలకు ఆన్‌లైన్‌లో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్‌సైట్‌లో ఈ నెల 20 వ తేదీ నుంచి మార్చి 10 వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మార్చి 25 వ తేదీన మొదటి విడత లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తామన్నారు. ఇతర వివరాలకు 18004258599 టోల్ ఫ్రీ నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
సెమీ కండక్టర్ల హబ్‌గా భారత్
నారాయణవనం: రాబోవు రోజుల్లో భారత దేశం సెమీ కండక్టర్లకు, క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మారబోతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో కీలక పాత్ర ఇంజినీర్లదే ఉంటుందన్నారు. మేక్ ఇండియా, స్కిల్ ఇండియా నినాదాలతో ప్రారంభమయ్యే స్టార్టప్ కంపెనీలకు కేంద్రం ఊతమిస్తోందన్నారు. సెమీ కండక్టర్ల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపు జరిగిందని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం రూ.9 వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్త రామమూర్తి మాట్లాడుతూ ఆలోచనే ఇంజినీర్లకు గుర్తింపు తీసుకువస్తుందన్నారు. పరిశోధలపై మక్కువ చూపి, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు సినీనటి నిథి అగర్వాల్ హాజరై సందడి చేసింది. ఈ కార్యక్రమాలలో కళాశాలల చైర్మన్ అశోకరాజు, వైఎస్ చైర్మన్ ఇందిరవాణి, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు.
నీటి సంపులో పడి కార్మికుడి మృతి


