కిక్కుకు రెక్కలు!
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో
ఇష్టానుసారంగా మద్యం ధరలు
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఎవరి ఇష్టం వాళ్లది. ఒక దుకాణంలో ఉన్న ధర, మరో దుకాణంలో ఉండడంలేదు. ఇదేమిటని అడిగితే ప్రభుత్వం ధరలు పెంచిదంటూ సమాధానం. అసలు ఎంత పెంచింది..? ఎంతకు విక్రయిస్తున్నారు..? వేటిపై ధరలు పెంచారు..? అనే ప్రశ్నలకు సమాధానాల్లేవు.
చిత్తూరు అర్బన్: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మద్యం ధరల నియంత్రణను గాలికొదిలేశారు. అమ్ముకున్నోడికి అమ్ముకున్నంతగా పట్టించుకోవడం మానేశారు. ఇదే అదునుగా వ్యాపారులు మ ద్యం ధరలను పెంచేశారు. ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తూ మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు.
కోట్లు ‘లూఠీ’
‘వడ్డించేవాడు మనోడైతే చాలు..’ అన్నట్లు మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు ఏడాదిన్నరగా పెద్దగా లాభాలు రావడంలేదని భావించిన ప్రభుత్వం.. క్వార్టర్ బాటిల్‌పై రూ.10 పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా చెప్పిందో లేదో.. జీవో రాకపోయినా పర్లేదు అన్నట్లు, వ్యాపారులు జిల్లాలో ధరలు పెంచేశారు. జీవో ఇవ్వడానికి నాలుగు రోజుల సమయం పట్టగా.. అప్పటికే దాదాపు రూ.5 కోట్లు కొల్లగొట్టేశారు. ఇక అప్పటి నుంచి రెండు జిల్లాల్లో మద్యం ధరలపై నియంత్రణ పట్టుతప్పింది. ఒక దుకాణంలో దొరికే ధర, మరో దుకాణంలో ఇవ్వడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అమ్ముకుంటున్నారు. ఫలితంగా రెండు జిల్లాల్లో మద్యం ప్రియుల నుంచి రోజుకు దాదాపు రూ.40 లక్షల వరకు దోచుకుంటున్నారు. ఇందులో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వాటాల్లేవంటే నమ్మశక్యం కావడం లేదు.
అన్నింటిపై బాదుడే
గత నెల 8న అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎకై ్సజ్ పాలసీలో పలు మార్పులు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం తీసుకుంది. ఇందులో ప్రతి మద్యం బాటిల్‌పై రూ.10 పెంచడమనేది ప్రధాన నిర్ణయం. రూ.99 మద్యంకు ఇందులో మినహాయింపు ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకున్న క్షణాల్లోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో ధరలు పెంచేశారు. ప్రతి క్వార్టర్ బాటిల్‌పై రూ.10 అక్రమంగా వసూలు చేయడం ప్రారంభించారు. బీర్ విక్రయాలపై ధరల పెంపు లేకపోయినా.. జిల్లాలో యథేచ్ఛగా ధరలు పెంచేసి దోచేస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లపై రూ.20 – రూ.50 చొప్పున క్వార్టర్ బాటిల్‌పై వసూలు చేస్తున్నారు. ఐదు రోజులు తర్వాత జీవో వచ్చినా.. అప్పటికే మద్యం ప్రియుల నుంచి రూ.కోట్లు పిండుకున్నారు.
విచ్చలవిడిగా ‘బెల్టు’..
తిమ్మిని బమ్మి చేస్తూ..
పెంచిన మద్యం ధరలపై ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాపారులు ఇచ్చే సమాధానంతోనే మద్యం ప్రియులకు సగం కిక్కు దిగిపోయేలా ఉంటుంది. తొలుత ధరల పెంపు జీవో రాకమునుపే.. ‘ప్రభుత్వం ధరలు పెంచింది’ అని బోర్డు పెట్టి అదనంగా దండుకున్నారు. ఆపై జీవో అమల్లోకి వచ్చాక.. తీరా బాటిళ్లపై పాత ధరలు ఉన్న వాటిని కొట్టేసి, కొత్త ధరలు ప్రింట్ చేసి పంపిణీ చేస్తే.. బాటిళ్లపై పాత ధరను చెరిపేసి.. పెరిగిన ధరను ముద్రించారు. పెరిగిన ధర ముద్రించిన తర్వాత కూడా బాటిళ్లపై ఉన్న ధర కాదని అదనపు నగదు వసూలు చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే ‘ప్రభుత్వం ధరలు పెంచింది’ అనే బోర్డు చూపిస్తున్నారు. వీటిపైనే ధరలు పెరిగాయంటూ అదనపు నగదు వసూలు చేస్తూ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొందరు వ్యాపారులు రోజుకు రూ.లక్షలు దోచుకుంటున్నారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిగా వెలుస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో దాదాపు 4 వేలకు పైగా బెల్టు దుకాణాలున్నట్టు సమాచారం. చిల్లర కొట్టు నుంచి కిరాణా దుకాణం వరకు ప్రతీ చోటా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీ కంటే రూ.20–రూ.50 అధిక ధరలకు బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మేస్తున్నారు. వీటిల్లో లభిస్తున్న మద్యం ఏ బ్రాండు..? ఏ దుకాణం నుంచి వచ్చింది..? అసలు కల్తీనా..? అనే ప్రశ్నలకు ఎవ్వరి వద్దా సమాధానాలు దొరకడం లేదు. మద్యం కల్తీ కాకపోతే వాటిపై ఉన్న క్యూఆర్ ఆధారంగా అవి ఏ దుకాణానికి చెందినవో ఎక్సైజ్ అధికారులు గుర్తించి, రూ.లక్షల్లో జరిమానాలు విధించాలి. కానీ జిల్లాల్లో అలా జరగడం లేదు. వ్యాపారుల అక్రమంగా వసూలు చేస్తున్న దాంట్లో ఎకై ్సజ్‌శాఖలోని పలు పెద్ద తిమింగలాలతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులకు వెళుతోందనే ఆరోపణలు లేకపో లేదు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
మద్యం ధరలు ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయి. చిత్తూరు జిల్లాలో ఎకై ్సజ్ సూపరింటెండ్ ఫోన్–9492925832, తిరుపతి జిల్లాలో ఫోన్–9440902540 నంబర్లకు ఫిర్యాదు చేయండి. వీటితో పాటు టోల్‌ఫ్రీ నంబరు–14405కు కూడా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– విజయశేఖర్, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్


