మేం భూములు ఇవ్వలేం
కుప్పం: పరిశ్రమలకు భూములు ఇవ్వలేమని పలార్లపల్లి గ్రామస్తులు తహసీల్దార్ చిట్టిబాబుకు తేల్చిచెప్పారు. శుక్రవారం పలార్లపల్లి గ్రామంలో గ్రమసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ లెక్క దాఖలాలో 18 ఎకరాల ప్రభుత్వ భూమి పరిశ్రమలకు ఎంపిక చేశారు. ఇంకా 12 ఎకరాల పట్టా భూమి కావాల్సి ఉందని తహసీల్దార్ రైతులకు సూచించారు. దీనిపై రైతులు మాట్లాడుతూ ఇప్పటికే వందలాది ఎకరాల భూములు ఇచ్చామని, ఇక మిగిలిన కొద్ది పాటి భూములు ఇస్తే తమ జీవనాధారం ఏంటని ప్రశ్నించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తాము భూములు కోల్పోతే ఎలా బతకాలని నిట్టూర్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని ఖరాకండీగా చెప్పారు. దీంతో తహసీల్దార్ అక్కడి నుంచి వెళ్లి పోయారు.


