జీతమో రామ‘చంద్రా’!
చిత్తూరు అర్బన్: రాష్ట్రం మొత్తంలేని సమస్య ఒక్క చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లో తలెత్తింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 500 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకటో తేదీన అందాల్సిన వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరో నెల కూడా వచ్చేస్తోంది. రెక్కాడితేగానీ డొక్కాడని దిగువ మధ్యతరగతి వేతన జీవుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.
ఏం తినాలి?
కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 500 మందికి పైగా ఆప్కాస్ ఉద్యోగులకు సకాలంలో వేతనలు అందకపోవడంతో వాళ్ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇంట్లో తినడానికి బియ్యం లేక కొందరు, పిల్లలకు ఫీజులు, నిత్యావసర సరుకులు, ఆస్పత్రి ఖర్చులు.. ఇలా అన్నింటికీ వేతనాలపైనే ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నెలవారి వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మరికొందరు తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లించకపోవడంతో కొత్త అప్పులు పుట్టడం లేదు. కొందరు కార్మికులు ప్రజారోగ్యశాఖలోని అధికారులను దీనిపై ప్రశ్నిస్తే.. శ్రీమేం బిల్లులు పంపించేశాం. ఏదైనా ట్రెజరీలో సమస్య ఉంది. వెళ్లి వాళ్లను అడగండిశ్రీ అంటూ నిర్లక్ష్యంగా బదులిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తప్పిదమే
చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లోని ప్రజారోగ్య విభాగంలో 324 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 124, కార్యాలయం, ఇతర శాఖల్లో కలిపి మొత్తం 500 మంది వరకు కార్మికులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దళారులను తీసేసి, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్స్డ్ సర్వీస్ (ఆప్కాస్) పేరిట.. నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే వేతనాలు జమయ్యేలా ఓ సంస్థను రూపొందించారు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆప్కాస్‌ను పక్కకుపెట్టి ఒక్కో ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో వేతనాలు ఇచ్చే ప్రక్రియను తీసుకొస్తోంది. దీనివల్ల మళ్లీ ఉద్యోగులు దళారుల చేతుల్లోకి వెళ్లిపోవడం, కమీషన్ల దందా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీల్లోని ఆప్కాస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను ఓ బ్యాంకులో కొత్తగా ఖాతాలు తెరచేలా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో చిత్తూరు కార్పొరేషన్‌లో ఆప్కాస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు తెరవడంతో సిబ్బంది ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లలేదు. వేతన బిల్లులు చేసే సమయంలో ఓ బ్యాంకు ఖాతా, మరో బ్యాంకు ఐఎఫ్‌ఎస్ కోడ్ ఉండడంతో సమస్య నెలకొంది. కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన వేతనాలు ఇప్పటి వరకు అందలేదు.


