ఆ సెక్షన్ల పనితీరు మారాల్సిందే
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పలు సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని ట్రాన్స్‌కో జిల్లా నోడల్ అధికారులు కృష్ణారెడ్డి, మురళీ హెచ్చరించారు. మంగళవారం ఎస్సీ కార్యాలయంలో క్షేత్ర స్థాయి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యుత్‌శాఖ పై ప్రజల్లో మంచి అభిప్రాయం వచ్చే విధంగా నడుచుకోవాలన్నారు. అందులో భాగంగా సిబ్బంది ఎప్పుడూ క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వినియోగదారులు ఫోన్‌చేస్తే మర్యాదగా సమాధానం ఇవ్వాలన్నారు. జిల్లాలో గిరింపేట, సంతపేట, నిండ్ర సెక్షన్ల పనితీరు బాగుందన్నారు. అదే విధంగా గంగవరం, పాలసముద్రం, యాదమరి సెక్షన్ల పనితీరు అధ్వాన్నంగా ఉందన్నారు. సంస్థ జీతాలు ఇస్తోందని పనిచేయడానికని సాకులు చెప్పడానికి కాదన్నారు. విద్యుత్ సరఫరా, సిబ్బంది అందుబాటులో ఉన్నారా..? అనే అంశాల పై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకుంటోదన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు వస్తే వాటిని తెలపాలన్నారు. ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్, ఈఈలు మునిచంద్ర, సురేష్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


