గజరాజులకు మృత్యుగండం
కౌండిన్యలో ఏనుగుల ఉనికి ప్రశ్నార్థకం గత పదేళ్లలో 22 దాకా ఏనుగులు మృత్యువాత మొన్న పరదరామి చెరువులో గాయపడిన ఏనుగు మృతి నిన్న మోర్థనా ఫారెస్ట్‌లో మరో ఏనుగు కళేబరం లభ్యం ఏనుగుల సంరక్షణలో అటవీశాఖ అధికారుల వైఫల్యం
పలమనేరు : కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలోని ఏనుగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అడవిలోంచి మేత కోసం అడవిని దాటి వచ్చే ఏనుగులు పలు రకాల ప్రమాదాలు, పెనుగులాటలు, ముఖ్యంగా కరెంట్ షాక్‌లతో మృతి చెందుతున్నాయి. కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలోని ఏనుగులకు నిత్యం ప్రాణగండం తప్పడం లేదు. ఐదు రోజుల కిందట కౌండిన్య నుంచి పరదరామి బీట్‌లోకి వెళ్లిన ఒంటరి ఏనుగు గాయపడి చికిత్స నిమిత్తం తిరుపతి జూపార్క్‌కు తరలించగా బుధవారం మృతి చెందింది. తాజాగా కౌండిన్యకు ఆనుకుని ఉన్న తమిళనాడు మోర్థనా అడవిలో మరో ఒంటరి ఏనుగు మృతి చెందిన కళేబరాన్ని అక్కడి ఫారెస్ట్ అధికారులు శుక్రవారం గుర్తించారు. దీంతో ఇప్పటికి 22 ఏనుగులు మృతి చెందాయి. ఏనుగులను కాపాడుకోవడంలో అటవీశాఖ విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆహారం కోసం అడవిని దాటి...
కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవసరమైన ఆహారం తక్కువ. దీంతో ఏనుగులు ఇష్టౖమైన ఆహారం కోసం అడవిని దాటుతున్నాయి. దీనికితోడు తమిళనాడులోని మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళ్తే తమిళనాడు అటవీశాఖ కౌండిన్య వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండడడం లేదు. ఇటీవల కాలంలో కౌండిన్యలోని ఏనుగులు సోమల మీదుగా చంద్రగిరి వైపునకు బంగారుపాళెం, గుడిపాల వైపునకు వెళ్లిన విషయం తెలిసిందే.
శాశ్వత పరిష్కారం చేపడితేనే..
అడవిని దాటి ఏనుగులు రాకుండా అటవీశాఖ శాశ్వత పరిష్కారాలను చూపడంలో ఆ శాఖ విఫలమవుతోంది. తాజాగా కుంకీ ఏనుగుల ద్వారా అడవిలోని ఏనుగులను కట్టడి చేసే కార్యక్రమం సైతం విజయవంతం కాలేదు. దీంతో ఏనుగులు అడవిని దాటి బయటకొస్తున్నాయి. ఏనుగులను కాపాడుకొనేందుకు అటవీశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు చనిపోయిన ఏనుగు పలమనేరులో హల్‌చల్
తిరుపతి జూలో రెండు రోజుల క్రితం మృతి చెందిన ఒంటరి ఏనుగు ఇటీవల పలమనేరులో హల్‌చల్‌చేసి ఎఫ్‌ఎస్వో సుకుమార్‌పై దాడి చేసింది ఇదే. మదపు టేనుగులు చేసిన దాడిలో ఇది తీవ్రంగా గాయపడి చెరువులో పడిపోయింది. కుంకీ ఏనుగుల ద్వారా దాన్ని బయటకు లాగే ప్రయత్నంలో మరింత గాయపడి మృతి చెందినట్టు తెలుస్తోంది. తాజాగా మోర్థనా ఫారెస్ట్‌లో ఓ ఒంటరి ఏనుగు మృతి చెందిన కళేబరాన్ని అక్కడి ఫారెస్ట్ అధికారులు శుక్రవారం గుర్తించారు. ఇది కూడా ఇక్కడినుంచి ఆ ప్రాంతం వైపు వెళ్లినట్లు తెలుస్తోంది.


