ప్రగల్బాల పీటీఎం
సొంత డప్పుకే పరిమితమైన మెగా పీటీఎం బడుల అభివృద్ధిపై మాయమాటలు ప్రోగ్రెస్ కార్డులపై సమీక్షల్లేని వైనం మొక్కుబడిగా మారిన మెగా పీటీఎం
చిత్తూరు కలెక్టరేట్ : పేరుకే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం), కానీ జిల్లా అంతటా మొక్కుబడిగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న పాఠశాలల్లో మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో డుమ్మా కొట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2408 పాఠశాలల్లో మెగా పీటీఎం నిర్వహించాల్సి ఉంది. అయితే 2,202 పాఠశాలల్లో సమావేశం నిర్వహించగా 206 పాఠశాలల్లో ఎగ్గొట్టారు. ఈ సమావేశాల నిర్వహణకు హంగు, ఆర్భాటాలు చేశారు. టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల వద్ద హంగామా చేశారు. సమావేశాల్లో సమస్యలపై మాట్లాడవద్దని విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ముందుగానే చెప్పించినట్లు తెలిసింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన ఈ మెగా పీటీఎం కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటానికే పనికొస్తుందని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు.
తూతూమంత్రంగా హాజరై..
జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా ఒక్కొక్క పాఠశాలకు హాజరై ఆ తర్వాత ముఖం చాటేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం జెడ్పీ హైస్కూల్‌లో హాజరై ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి వి.కోట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ కుప్పం కేజీబీవీ పాఠశాలకే పరిమితమయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎలాంటి కేడర్ లేకున్నా చల్లా రామచంద్రారెడ్డి జెడ్పీ రొంపిచెర్ల పాఠశాలలో హంగామా చేశారు. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే భానుప్రకాష్ ఏ ఒక్క పాఠశాలలో పాల్గొనకుండా డుమ్మా కొట్టారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ చిత్తూరు రూరల్ లోని తుమ్మింద పాఠశాల సమావేశానికి మాత్రమే పరిమితమయ్యారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్ కాణిపాకం జెడ్పీ హైస్కూల్ లో పాల్గొని ఆ తర్వాత డుమ్మా కొట్టారు. మిగిలిన చోట్ల కార్పొరేటర్‌లు, టీడీపీ నామినేటెడ్ సభ్యులతో మమ అనిపించారు.
టీడీపీ సంబరాల్లా?
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పీటీఎం మీటింగ్‌లు టీడీపీ సంబరాలుగా మార్చేశారు. ఈ సమావేశాల్లో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కార్యా చరణ, ఆయా పాఠశాలల్లో ఉన్న సమస్యలపై చర్చించడం, విద్యార్థుల ప్రొగ్రెస్ కార్డుల పురోగతి తెలియజేయడం వంటివి చేయాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా టీడీపీ నాయకులు సమావేశాల్లో పాల్గొని ఊకదంపుడు ప్రసంగాలతో ముగించారు. ఈ సమావేశాల్లో తల్లిదండ్రులు కేవలం 40 శాతం మాత్రమే పాల్గొనగా తమ గొప్పల కోసం అధికారులు తప్పుడు నివేదికలను సిద్ధం చేశారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్న పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తుగా ఏర్పాట్లు చేశా రు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కచ్చితంగా హాజ రు కావాలంటూ ముందస్తు హుకుం జారీ చేశారు.


