‘మీ పిల్లలు బాగా చదువుతున్నారా’?
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మీ పిల్లలు బడికొస్తున్నారా? బాగా చదువుతున్నారా? బడిలో టీచర్ల పనితీరు? మధ్యాహ్న భోజనం బాగుందా? యూనిఫాం, పుస్తకాలు ఇచ్చారా? ఇంటికొచ్చాక మీ పిల్లలను చదివిస్తున్నారా అంటూ జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఓ తల్లిని ప్రశ్నించారు. చిత్తూరు మండలంలోని తుమ్మింద ప్రాథమిక పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతి తరగతిని క్షుణంగా పరిశీలించారు. పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. విద్యా భోధనపై అడిగి తెలుసుకున్నారు. తరగతిలో విద్యార్థుల హాజరును పరిశీలించారు. బోధనా తీరుపై ఉపాధ్యాయులను ప్ర శ్నించారు. అనంతరం తల్లిదండ్రులతో కాసేపు ముచ్చ టించారు. చివరగా పీటీఎం కార్యక్రమానికి ఎందుకు తల్లిదండ్రులు రాలేదని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అడిగారు. అందుకు ఊళ్లో మీటింగ్, స్కూల్‌లో మీటింగ్ కారణంగా రాలేదని వివరించారు. ఆ మీటింగ్ అయినా తర్వాత తల్లిదండ్రులను పిలిచి కార్యక్రమ ఉద్దేఽశాన్ని వివరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.


