అంతా కనికట్టు!
చిత్తూరు అర్బన్: జిల్లాలో ఇనుప తుక్కు, గ్రానైట్ రవాణా ఆధారంగా ఇన్‌పుట్ సబ్సిడీ క్రెడిట్ (ఐటీసీ) కొల్లకొడుతున్నారు. ఈ రెండింటినీ ఇతర రాష్ట్రాలకు విక్రయించాలంటే వాణిజ్య పన్నులశాఖ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) తీసుకోవాలి. చిత్తూ రు, తిరుపతి ఉమ్మడి జిల్లాల్లో కొందరు వ్యక్తులు బినామీ పేరిట ఆర్‌సీలు తీసుకుని ఆ పేర్లపై లావాదేవీలు జరిపినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. అసలు ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే.. రూ.కోట్లు వెచ్చించి వాటిని వేలూరు, బెంగళూరు, గుజరాత్, రాజస్థాన్ వంటి పక్క రాష్ట్రాల్లోని డీలర్ల నుంచి కోనుగోలు చేసి అమ్మకాలు చేసినట్లు బిల్లులు పెడుతున్నారు. ఐటీసీ కోసం కొత్త దారులు తొక్కుతున్నారు. పులిచెర్ల, చిత్తూరు, అరగొండ, రేణిగుంట, తవణంపల్లె తదితర ప్రాంతాలకు చెందిన దిగువ మధ్యతరగతికి చెందిన కూలి, రోడ్లపై వ్యాపారాలు, పెయింటింగ్ పనులు చేసేవాళ్లను ఎంచుకుని వాళ్ల ఆధార్ కార్డుతో ఓ సిమ్‌కార్డు, బ్యాంకులో ఖాతా ఓపెన్‌చేసి చెక్‌బుక్, డెబిట్‌కార్డు తీసుకుంటారు. ఆపై జీఎస్టీ లైసెన్సు తీసుకుని రూ.కోట్ల లో వ్యాపారాలు చేస్తుంటారు. భారీగా ఐటీసీ కాజేసి న తరువాత మేల్కొనే అధికారులు.. లైసెన్సు దారుడికి నోటీసులు జారీ చేయడానికి వెళితే అప్పుడు వాళ్లు కూలి పనులు చేసుకునేవాళ్లుగా గుర్తిస్తున్నారు.
లొసుగులే కాసులు
సులభంగా డబ్బులు సంపాధించడానికి అలవాటుపడ్డ కొందరు వ్యాపారులు అధికారులకు సరికొత్త సవాళ్లు విసురుతున్నారు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఇందులోని గూఢార్థాలు అర్థమయ్యేలోపు ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నారు. పైకి పాత ఇనుప తుక్కు (స్క్రాప్), గ్రానైట్ రవాణా లాంటి వ్యాపారాలు ప్రధానంగా కనిపిస్తున్నా, లోలోపల ప్లాస్టిక్ కంపెనీలు, చైర్లు, వాటర్ బాటిల్స్ తయారీ ఇలా ఎన్నో వ్యాపారాలను అడ్డుపెట్టి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కళ్ల ముందు ఎలాంటి వస్తువు కనిపించకపోయినా.. కాగితాల్లో రూ.కోట్లలో వ్యాపారాలు చూపించి కొందరు ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ప్రభుత్వ నిధులకు ఎసరుపెట్టారు. వాణిజ్య పన్నుల శాఖ, జీఎస్టీ శాఖల్లో ఉన్న వెలుసుబాటు ఈ కుంభకోణానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
మాస్టర్‌మైండ్‌ను పట్టుకోలేరా?
డీలర్ల వద్ద కొనుగోలు చేసిన ఇనుప తుక్కు, గ్రానైట్‌కు సంబంధించిన బిల్లులు అన్నీ కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులే ప్రింట్ చేసుకుంటున్నారు. రూ.80 కోట్లు వెచ్చించి కొనుగోలుచేసిన తుక్కును ఓ లారీలో సరఫరా చేసినట్లు బిల్లుల్లో చూపించారు. లారీ నెంబరు పరిశీలిస్తే.. అది బైకు నెంబరుగా ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. మరోవైపు 120 టన్నుల గ్రానైట్‌ను చిత్తూరుకు చెందిన వ్యాపారి మరో లారీలో తరలించినట్లు చూపించాడు. ఆ నెంబరు తనిఖీ చేస్తే, అది ఆటో నెంబరు. వీటికి భారీగా ఐటీసీని రాబట్టుకుని, తీరా కంపెనీ లావాదేవీలు నిర్వహించకపోవడంతో అసలు గుట్టు బయటపడుతోంది. దీని వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ను మాత్రం కనిపెట్టలేకపోతున్నారు.


