ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు
చౌడేపల్లె: వైఎస్సార్ సీపీ కోసం పోరాటం చేస్తూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపునిచ్చి ఏకష్టమొచ్చినా ఆదుకుంటామని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలోని ఎంపీ స్వగృహంలో చౌడేపల్లె మండల నేతలు, కార్యకర్తలు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో మమేకమై కష్ట సుఖాలపై చర్చించారు. ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత మండలంలో జరిగిన దాడులు, ఇబ్బందులు, నష్టాలు, అరాచకాలన్నీ తనకూ తెలుసని, ఎవరూ అధైర్యపడొద్దని, వడ్డీతో సహా మనం చెల్లించే సమయం వస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపుతోపాటు పనిచేసే వారికి పదవుల్లోనూ న్యాయం చేస్తామన్నారు. గ్రామ కమిటీల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపి చైతన్యవంతులు చే యాలని దిశానిర్దేశం చేశారు. మండలంలో ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పలువురు నేతలను జిల్లా కమిటీలో భాగస్వాములను చేసి మ రింత రెట్టింపు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఐకమత్యంతో అందరూ కలిసి పనిచేసి పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, పార్టీ మండల కన్వీనర్ నాగభూషణరెడ్డి, మండల ఉపాధ్యక్షులు వెంకటరమణ, లడ్డూ రమణ, కోఆప్షన్ సభ్యుడు సాధిక్ బాషా, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నేతలు పాల్గొన్నారు.


