దివ్యాంగులు ధైర్యంగా ముందుకు సాగాలి
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగులు ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో విభిన్నప్రతిభావంతులకు జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలన్నారు. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసే వ్యక్తులు విజయాలను సాధిస్తే, ప్రతికూలతలను అధిగమిస్తూ అసమాన విజయాలను సాధించే దివ్యాంగులు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతలన్నారు. అనంతరం దివ్యాంగులకు షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చెస్ పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత ఉన్న జట్లను ఖరారు చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్ర, కోచ్‌లు పాల్గొన్నారు.


