భరోసా కల్పించి!
అధికారంలోకి రాగానే విపత్తు
నష్టాలన్నింటినీ తీరుస్తాం
వెయ్యి ఇళ్లతో నూతన కాలనీ నిర్మిస్తాం
అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో
బృహత్తర పనులు చేపడతాం
కళత్తూరు, పాతపాళెం వాసులకు
అండగా ఉంటాం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ గురుమూర్తి
ముంపు బాధితులకు 650 ఫ్యాన్లు పంపిణీ
బాధ్యత తీసుకుని..
వరదయ్యపాళెం : మరో మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని, వెంటనే రాయలచెరువు ముంపునకు గురైన కళత్తూరు దళితవాడ, పాతపాళెం గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేయించే బాధ్యత తనదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎంపీ గురుమూర్తి, వైఎస్సార్ సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌తో కలసి కేవీబీపురం మండలంలోని కళత్తూరు దళితవాడలో ఆయన పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి కష్టనష్టాలను ఆరా తీశారు. గ్రామస్తులు మాట్లాడుతూ వందలాది పశువులు, గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయని, 2వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయని, రాళ్లురప్పలతో నిండి వ్యవసాయానికి యోగ్యత లేకుండా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ప్రతి ఇంట్లో రూ. లక్ష పైగా విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయని వారు వాపోయారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ బాధితులకు నష్ట పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. అయితే పేదల ఇబ్బందులు చంద్రబాబు సర్కారుకు ఏ మాత్రం పట్టవని, అందుకే ఇంతటి విపత్తుకు తూతూమంత్రంగా సాయం చేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జరిగిన నష్టాలను మూడేళ్లలో రానున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పూర్తిగా తీరుస్తామని, అది తన బాధ్యతని, ఆ మేరకు మీకు మాట ఇస్తున్నానని స్పష్టం చేశారు.
సమస్యలన్నీ పరిష్కరిస్తాం
లోతట్టు ప్రాంతంలో దళితవాడ ఉన్న కారణంగా పూర్తిగా మునిగిపోయినట్లు గ్రామస్తులు తన దృష్టికి తెచ్చారని, మన ప్రభుత్వం రాగానే మిట్ట ప్రాంతంలో నూతన కాలనీ ఏర్పాటు చేయిస్తామన్నారు. వెయ్యి ఇళ్లు నిర్మించి పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే ఏళ్లతరబడి ఇంటి స్థలాలకు సంబంఽధించి వివాదంగా మారిన అటవీ భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తామని వివరించారు. ఈ విపత్తు నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరారు. అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రమాదం సంభవిచంఇన గంటల వ్యవధిలోనే పార్టీ శ్రేణులు స్పందించి తమవంతు సాయం చేశారన్నారు. వారి స్పూర్తితోనే తనవంతుగా విషయం తెలిసిన గంటలోనే ఎంపీ నిధుల నుంచి రూ. 20లక్షలను తక్షణ సాయంగా మంజూరు చేసినట్లు వెల్లడించారు. తర్వాత మరో రూ. కోటి కేటాయించినట్లు తెలిపారు. అలాగే నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వివరించారు. ప్రతి నష్టానికి పరిహారం వచ్చేంత వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. నూకతోటి రాజేష్ మాట్లాడుతూ ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రమాదం జరిగిన రోజు నుంచి నేటి వరకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు.
మూడేళ్ల తర్వాత వచ్చేది
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే


