శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 24 కంపార్ట్‌మెంట్లలో దర్శనానికి వెళ్లే భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 62,129 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,026 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.13 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
నయనానందంగా
‘నృత్యవాహిని’
తిరుపతి రూరల్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న నృత్య వాహిని కార్యక్రమం నయనానందకరంగా సాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనతో నృత్య మహోత్సవం ఆకట్టుకుంటోంది. శుక్రవారం ఈ మేరకు థాయ్‌లాండ్‌కి చెందిన చియాంగ్ మై రాజ భాట్ యూనివర్సిటీ తరపున థాయ్ డ్రామాటిక్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్ ఖోన్ డాన్స్ అలరించింది. అనంతరం చేపట్టిన వర్కుషాపులో డాక్టర్ విపడా పెచ్చాట్ డాన్స్ గురించి వివరించారు. కళాకారులు ఆచరణాత్మక ప్రదర్శనతో సందడి చేశారు. గుజరాత్ వారు గర్బా నృత్యంపై వర్క్‌షాప్ నిర్వహించారు. మహారాష్ట్రలోని లే అండ్ నృత్యాంగణ స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌కి చెందిన శుభమ్ బిర్కురే బృందం నృత్యం ప్రదర్శించారు. చివరగా ఇంటర్ కల్చరల్ డాన్స్ డైలాగ్ అనే అంశంపై చర్చ చేపట్టారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య ఉమ, రిజిస్ట్రార్ రజని పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల : తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు సేవించుకున్నారు. వీరిలో సింగపూర్ హోంమంత్రి షణ్ముగం, మలేషియా ఎంపీ గణపతి రావు, రాష్ట్ర మంత్రి నారాయణ తదితరులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
జ్వరంతో బోయకొండ
కార్మికురాలి మృతి
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న నిమ్మనపల్లె మండలం బండ్లపై గ్రామానికి చెందిన గంగులమ్మ(45) కార్మికురాలు విష జ్వరంతో శుక్రవారం మృతి చెందింది. ఈమె గత వారం రోజులుగా జ్వరం రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో మృతి చెందినది. సుమారు 20 ఏళ్లుగా ఆమె బోయకొండలో సేవలందించినట్లు సహచర ఉద్యోగులు తెలిపారు. ఆమె మృతికి ఈఓ ఏకాంబరం, బోయకొండ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు.


