కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మామిడికి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కలెక్టర్‌రేట్‌ను ముట్టడిస్తామని మామిడి రైతుల సంఘం హెచ్చరించింది. చిత్తూరు నగరంలోని ఎస్టీయూ కార్యాలయంలో గురువారం ఆ సంఘం సమావేశం నిర్వహించింది. సంఘం నాయకులు మునీశ్వర్ రెడ్డి, బంగారు మురళి మాట్లాడుతూ.. మామిడి రైతులకు గుజ్జు పరిశ్రమలు కిలోకు రూ.8 లెక్కన చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అలా చర్యలు తీసుకోని పక్షంలో డిసెంబర్ నె నెలలో చిత్తూరు, తిరుపతి కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయని గుజ్జు పరిశ్రమలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదని మండిపడ్డారు. ప్రభుత్వం 40 వేల మంది మామిడి రైతుల పక్షమా లేక 40 గుజ్జు పరిశ్రమల పక్షమా తేల్చుకోవాలన్నారు. ప్రభుత్వ నిధి కోసం ర్యాంపులు తప్పు డు తూకాలు, లెక్కలు సృష్టించాయన్నారు. అవి లెక్క తేలక అధికారులు తలలు పట్టుకున్నారని, తద్వారా మామిడి రైతుల ముసుగులో దళారులు, ర్యాంపు యజమానులు, ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఫ్యాక్టరీల నుంచి రైతులకు రావాల్సిన బకాయిలను ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు హేమలత, సంజీవరెడ్డి, మునిరత్నం నాయుడు, ఉమాపతి నాయుడు, బెల్లంకొండ శ్రీనివాసులు, భారతమ్మ, మోహన్ రెడి, సందీ ప్, జయదేవయ్య, చంగల్రాయ రెడ్డి, వెంకటాచలం నాయుడు, త్యాగరాజు రెడ్డి పాల్గొన్నారు.


