విద్యార్థులతో పెట్టుకోవద్దు..ఖబడ్దార్
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులతో పెట్టుకోవద్దు ఖబడ్దార్ అంటూ ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలరాజు, నాసర్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్సు జాతా బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు అనేక హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయిందని దుయ్యబట్టారు. పేద విద్యార్థుల కష్టాలు తీరుస్తామన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రస్తుతం ఎక్కడ ఎప్పుడుంటారో కూడా తెలియని పరిస్థితి అన్నారు. అధికారంలోకి రాగానే నెల రోజుల్లోనే పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల చేస్తామన్న ఆయన మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో తూతూ మంత్రంగా పేపర్ ప్రకటనలు విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దారుణం
కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని బండి చలపతి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మండిపడ్డారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
విద్యాశాఖ మంత్రి పదవికి న్యాయం చేయని లోకేష్
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవి కి న్యాయం చేయడం లేదని ఏఐఎస్‌ఎఫ్ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ విమర్శించారు. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర రాష్ట్రంలో ఉందని, కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యావ్యతిరేక విధానాలను మానుకోకపోతే కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు సిద్ధమని తేల్చి చెప్పారు. ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, ఆంధ్ర యూనివర్సిటీ కార్యదర్శి అభి, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


