పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తే సహించం
పుంగనూరు: స్వచ్చాంధ్ర కమిషన్ చైర్మన్ పట్టాభి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మెప్పు కోసం పని చేస్తున్నాడు.. ఆయనకేం తెలుసు ? పుంగనూరు గురించి మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్దీన్ షరీఫ్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే రూ.వందల కోట్లతో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరును అభివృద్ధి చేశారని, అవాస్తవాలు మాట్లాడిన పట్టాభి మర్యాదగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే తగు చర్యలు తీసుకుంటాం అన్నారు. కాసుల కోసం పర్యటనలు చేస్తున్న పట్టాభి గత చరిత్ర అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు, లోకేష్ మెప్పుల కోసం పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణను చూసి సహించలేక కూటమి నేతలు తప్పుడు కేసులు బనాయిస్తూ, పెద్దిరెడ్డి నిర్మించిన ప్రాజెక్టులు, రోడ్లను రద్దు చేశారని ఆరోపించారు. పట్టాభికి దమ్ముంటే పుంగనూరులో బహిరంగ విచారణకు రావాలని రెడ్డెప్ప సవాల్ విసిరారు. ఈ పది సంవత్సరాలలో పుంగనూరు మున్సిపాలిటీకి నాలుగు అవార్డులు వచ్చాయని, గత నెలలో కూడా కూటమి ప్రభుత్వం స్వచ్ఛభారత్ అవార్డు అందజేసిందని తెలిపారు. సమావేశంలో వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, రాష్ట్ర హజ్‌కమిటీ మాజీ డైరెక్టర్ ఖాదర్, కౌన్సిలర్లు నటరాజ, కాళిదాసు, నాయకులు శ్రీనివాసులు, మహబూబ్‌బాషా, ఇంతియాజ్, సలామత్, రమణ, జయకృష్ణ, లక్ష్మణ్‌రాజు, నరేష్‌తో పాటు పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు ఇర్ఫాన్, అమరనాథరెడ్డి పాల్గొన్నారు.
ఆక్రమణలు చేసేది కూటమి నేతలే..
మున్సిపాలిటీలోని ఎంబీటీ రోడ్డులో ఆక్రమణలను తొలగించి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రోడ్డు విస్తరించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. కానీ పట్టాభి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆక్రమణలు చేస్తున్నారని ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ముడియప్ప సర్కిల్‌లో ఆక్రమణదారుల వద్ద పైసలు తీసుకుని అంగళ్లు పెట్టించిన ఘనత కూటమి నాయకులదేనని చైర్మన్ ఆరోపించారు. పట్టాభిలో నిజాయితీ ఉంటే ఆక్రమణలను తొలగించాలని చైర్మన్ సవాల్ విసిరారు.


