అమరరాజాలో దొంగలు పడ్డారు
యాదమరి: ప్రముఖ బ్యాటరీ సంస్థ అమరరాజ కంపెనీలో దొంగలు పడ్డారు. అన్నం పెట్టి ఆదరిస్తున్న సంస్థకే కన్నం వేశారు కేటుగాళ్లు. ఏకంగా రూ.2.73 కోట్ల విలువైన సొత్తును సంస్థ నుంచి కాజేసి రాత్రికి రాత్రే లక్షాధికారులు కావాలన్న వారి ఆశ చివరికి కటకటాల్లోకి నెట్టింది. చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు కథనం మేరకు వివరాలు ఇలా.. యాదమరి మండల పరిధిలోని మోర్ధానపల్లిలో అమరరాజ సంస్థ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తోంది. బ్యాటరీ ఉత్పాదనలో అత్యంత విలువైనటువంటి లెడ్ బుష్ కీలకం. పూతలపట్టు మండలం పేటమిట్టలో ఉన్న ఇదే కంపెనీకి చెందిన మరొక సంస్థ నుంచి లెడ్ బుష్ యాదమరి బ్రాంచ్‌కు సరఫరా అయ్యేది. ఈ క్రమంలో సరఫరాకు సంబంధించి దాదాపు 91 టన్నుల లెడ్ బుష్ ఘనాంకాలలో చాలా వ్యత్యాసం బయటపడ్డాయి. దీంతో సంస్థ జనరల్ మేనేజర్ ఈ నెల 4న యాదమరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు డీఎస్పీ సాయినాథ్ ఆద్వర్యంలో ఎస్‌ఐ ఈశ్వర్, సిబ్బందితో దర్యాప్తు చేపట్టగా బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన పంథాలో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో రామభద్రాపురంలో దాచిన చోరీకి సంబంధించి రూ.82,80,000 విలువ చేసే 27.6 టన్నుల లెడ్ బుష్, చొరీకి గురైన మిగిలిన సొత్తును అమ్మగా వచ్చిన సుమారు రూ.1.86 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో మహేంద్ర, గణేష్, డిల్లి బాబు, కష్ణయ్య, హరి సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. వీరితో పాటు స్క్రాప్ బిజినెస్ చేసే ఆరిఫ్, సరుకును బయటకు తీసుకువెళ్లడంలో సహకరించిన డ్రైవర్ బాబును అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి చోరీ సొత్తుతో పాటు ఒక ఐచర్, దోస్త్ వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. త్వరితగతిన కేసును ఛేదించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు.


