ప్రభుత్వ స్కూల్ మైదానంలో జనసేన మీటింగ్ !
గుడిపాల: మండల కేంద్రంలోని నరహరిపేట జెడ్పీ హైస్కూల్ పాఠశాల మైదానంలో జనసేన నేతలు బుధవారం పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. అనంతరం క్రీడా మైదానంలో పార్టీ మీటింగ్ నిర్వహించారు. స్కూల్‌లో ఓ వైపు తరగతులు జరుగుతున్నా.. పార్టీ కార్యక్రమం నిర్వహించడంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూల్‌లో రాజకీయ పార్టీల సమావేశాలు ఇంతవరకు ఎప్పుడూ నిర్వహించలేదని.. కొత్తగా ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రాజకీయ పార్టీలకు ఎందుకు అనుమతులు ఇస్తున్నారని, ఇలాగే కొనసాగితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలని ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లో రాజకీయ పార్టీ మీటింగ్‌కు అనుమతి ఇచ్చిన వారిపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.


