అక్రమాలు బయటపెడితే బెదిరింపులు
జిల్లావ్యాప్తంగా ప్రకృతిలోని ఖనిజ సంపదను దోచేస్తున్న కూటమి నేతలు
యాదమరిలో క్వారీల అక్రమాలకు అంతే లేదు
కుప్పం, చిత్తూరు, గంగాధరనెల్లూరులో అదే తంతు
గుట్టలతో పాటు అడవిలో యథేచ్ఛగా గ్రానైట్ తవ్వకాలు
జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల పేలుళ్లతో జనావాసాల్లోకి చేరుతున్న వన్యప్రాణులు
వన్యప్రాణుల సంరక్షణ చట్టానికి తూట్లు
జిల్లాలో క్వారీలను కొల్లగొడుతున్నారు. గుట్టలతో పాటు అటవీ భూముల్లో సైతం దుమ్ముదులిపేస్తున్నారు. ఖనిజ సంపదను అక్రమంగా కొల్లగొట్టేస్తున్నారు. లీజు పేరిట రాయల్టీకి కుచ్చుటోపీ పెడుతున్నారు. దొంగ బిల్లుల దందాకు రైట్ రైట్ అంటున్నారు. ఈ దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. అక్రమార్కులకు కొండలు, గుట్టలు, అటవీ భూములు బద్ధలవున్నారు. ఈ దందాలో పలువురు కూటమి నేతలు పైచేయిగా నిలుస్తున్నారు. అక్రమాలు బహిరంగంగా జరుగుతున్నా మైనింగ్, అటవీశాఖ, రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై జిల్లా ప్రజానీకం భగ్గుమంటోంది.
యాదమరిలో అక్రమంగా నిర్వహణలో ఉన్న క్వారీలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లావ్యాప్తంగా ఖనిజ సంపద పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. అధికారం అండతో ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు చేస్తున్న అక్రమాలకు కొండలు కనుమరుగవుతున్నాయి. జిల్లాలో 400 పైగా క్వారీలు ఉన్నాయి. వీటిలో 200 క్వారీలకు పైగా తవ్వకాలు జరుగున్నాయి. మిగిలినవి నాణ్యత, నెర్రెలు ఉండడంతో బ్రేకులు పడ్డాయి. జిల్లాలో అనధికారికంగా వందకు పైగా క్వారీలు నడుస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. కుప్పం, పలమనేరు, బంగారుపాళ్యం, యాదమరి, జీడీనెల్లూరు, ఎస్‌ఆర్ పురం, పాలసముద్రం, వెదురుకుప్పం, చిత్తూరు తదితర మండలాల్లో అక్రమ క్వారీలు నిర్వహణలో ఉన్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.
జీడీనెల్లూరులో వారి దందానే సెప‘రేటు’..
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి అనుచరులు ప్రకృతి సంపదను కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. క్వారీల నిర్వహణకు అనుమతి కావాలన్నా, అక్రమంగా నిర్వహిస్తున్న వాటిపై అధికారుల దాడులు చేయకుండా వీరే పైరవీలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పెనుమూరు మండలానికి చెందిన ఓ కూటమి నాయకుడు ఒక్కో బ్లేడ్‌కు రూ.40 వేలు ప్రతీ నెలా మామూలు వసూలు చేస్తున్నాడని, దొంగబిల్లులతో క్వారీల నుంచి వసూళ్లకు పాల్పడున్నట్లు సొంత పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
మైనింగ్ అధికారి అండదండ..
చిత్తూరు ప్రాంతంలో జరుగుతున్న కొన్ని అక్రమ క్వారీల నిర్వాహకులపై మైనింగ్ శాఖలోని ఓ అధికారి అండదండలు ఉండడంతో అక్రమ క్వారీలు మూడు పువ్వులు.. ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. అనుమతి లేకున్నా.. ఉన్నట్టు అక్రమాలకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు. దొంగ బిల్లుల వ్యవహారం లోలోపల జరిగిపోతోందని కూటమిలోని ఓ వర్గం కోడైకూస్తోంది.
జరిమానాతో సరిపెట్టి..
బంగారుపాళ్యంలో అక్రమ క్వారీల్లో దందా జోరుగా సాగుతోంది. ఇటీవల పట్టుబడిన ఓ క్వారీనే ఇందుకు నిదర్శనం. అయితే ఆ క్వారీలో అక్రమాలకు అధికారులు జరిమానాతో సరిపెట్టారు. చట్టపరమైన చర్యలేవీ తీసుకోలేదు. స్థానికంగా ఉన్న ఓ నేత అండదండలతో ఈ దందా నడవడంతో అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారనే విమర్శలు వస్తున్నాయి.
అక్రమ క్వారీల విషయాన్ని బయట పెట్టే వ్యక్తులను కూటమి నేతలు టార్గెట్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఆఖరికి కూటమి నేతలు ఉన్నా.. వారిని హింసిస్తున్నారు. వార్తా పత్రికల్లో వార్తలు వస్తే.. మనుషులతో కొట్టిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్యామిలీని రోడ్డుపైకి లాగేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మండలంలోని ఓ నేత గుప్పెట్లో జరుగుతున్న అక్రమ క్వారీ విషయాన్ని బట్టబయలు చేస్తే.. ఆ నేత బెదిరింపులు హద్దులు దాటాయి. అధికారులు సైతం ఆ నేతకు కొమ్ము కాస్తున్నారు. దీంతో నెలనెలా అక్రమ క్వారీల నుంచి రూ.20 లక్షలు వసూళ్లు చేస్తూ..అన్ని రకాలుగా కాపాడతానని భరోసా ఇస్తున్నారని, అయితే అక్రమాలు బహిర్గతం కావడంతో ఆ వసూళ్లకు అడ్డుకట్ట పడుతుందని సదరు నేత లోలోపల కుమిలిపోతున్నారని తెలిసింది. ఆ నేత అక్రమాల చిట్టాను వ్యతిరేకవర్గం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రంగంలోకి దిగింది. అక్రమాలను గుర్తించడంతో పాటు.. వచ్చిన కథనాల వాస్తవాలను గుర్తించే పనిలో పడింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఇందులో తేలిన వాస్తవాలను నివేదికల రూపంలో రాష్ట్ర అధికార యంత్రాంగానికి సమర్పించినట్లు తెలిసింది. ఇక కార్యాలయంలో అధికారిని నేరుగా పిలిచి విచారించారు. దీంతో ఆ అధికారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో విచారణ జరుగుతోందని, ఆపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖలోని అధికారులే చెబుతున్నారు.
వన్యప్రాణులే భయపడి పరుగులు..
యాదమరి రక్షిత అటవీ ప్రాంతంలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా గ్రానైట్ తవ్వకాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధం అని తెలిసినా సంబంధిత అటవీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ఆ అక్రమార్కులకు ‘భజన’ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతూ..అటు పర్యావరణానికి, ఇటు వన్యప్రాణులకు హానీ కలిగిస్తున్నారు. యాదమరి మండలం భూమిరెడ్డిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో విలువైన ఖనిజ సంపద కలిగి ఉంది. దీనిపై కన్నేసిన ఓ కూటమి నేత అధికార బలాన్ని ఉపయోగించి అడవిని చెరబడుతున్నాడు. రూ.కోట్లు కురిపిస్తున్న ఈ కల్పవనాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి సదరు నేత ఊసరవెల్లిలా రాజకీయ రంగులు మార్చుతుంటాడనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని నెలలు పాటు స్తబ్దుగా ఉన్న ఆ నాయకుడు.. ఇప్పుడు తన క్వారీ దందాను ప్రారంభించాడు. భారీ యంత్రాలతో, నిషేధిత జిలెటిన్ స్టిక్స్‌తో బ్లాస్టింగ్‌లు జరిపి నింగిని తాకేలా ఉండే భారీ కొండలను సైతం నేలమట్టం చేస్తున్నారు. దీంతో అడవి జంతువులు జనావాసాల్లోకి, పొలాల్లోకి వచ్చి రైతులను నట్టేట ముంచుతున్నాయి. అడవుల్లోని క్వారీల తవ్వకాలతో అక్కడ లభ్యమయ్యే నీటి వనరులు ఆవిరవుతున్నాయి. తద్వారా వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కాలంలో మండలంలో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లోకి ఏనుగుల గుంపు వెళ్లి పంట పొలాలపై నానా బీభత్సం సృష్టించిన ఘటన తెలిసిందే. అడవిలో జరుగుతున్న ఈ నయా దందాకు సంబంధించి అటవీ ఉన్నతాధికారులకు, మైనింగ్ అధికారులకు తెలిసినా నెలావారి మామూళ్లు అందుకుంటూ మిన్నకుండిపోతున్నారనే విమర్శులు వినిపిస్తున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అవి సంచరించే చోట తవ్వకాలు చేపట్టడం, భారీ శబ్దాలతో కొండలను పేల్చడం వంటివి చట్ట విరుద్ధం. అయినా రూ.కోట్లు అక్రమార్జన కోసం చట్టాలను తుంగలో తొక్కేస్తున్నారు.
సీఎం నియోజకవర్గంలో కూడా..
అయితే ఈ క్వారీల దందాలో కూటమి నేతలు సహాయ సహకారాలు మెండుగా ఉండడంతోనే కొందరు అక్రమార్కులు విచ్ఛలవిడిగా చెలరేగిపోతున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో దాదాపు 10 అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండడం వీరికి కలిసి వస్తోంది. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ యథేచ్ఛగా ఖనిజ సంపదను సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా ముఖ్యమంత్రికి తెలియనివ్వకుండా నియోజకవర్గంలోని కొందరు ప్రధాన నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఓ అధికారిపై
విచారణ..
అక్రమాలు బయటపెడితే బెదిరింపులు
అక్రమాలు బయటపెడితే బెదిరింపులు


