మామిడి తోటలో ఏనుగుల గుంపు తిష్ట
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని దేవళంపేట పంచాయతీ బాలిరెడ్డిగారిపల్లె సమీపంలో ఉన్న ఆర్‌సీ రెడ్డెప్పరెడ్డి మామిడి తోపులో బుధవారం దాదాపు 10 ఏనుగులు గుంపుగా చేరి తిష్ట వేశాయి. ఉదయం అటవీశాఖ సిబ్బంది ఏనుగులు ఎక్కడెక్కడ తిరిగాయని పరిశీలిస్తుండగా మామిడి తోపులో గజరాజుల గుంపు కనిపించింది. రాత్రంగా చుట్టుపక్కలా పొలాల్లో మామిడి కొమ్మలను విరిచేసి, కమ్మికూసాలు(ఫెన్సింగ్)విరిచి వేశాయి. ప్రతిరోజూ సమీపంలోని అటవీ ప్రాంతాలకు వెళ్లే ఏనుగులు ఈరోజు మాత్రం మామిడి తోపులోనే ఉండిపోయాయి. విషయం తెలుసుకున్న ఫారెస్టు రేంజి అధికారి సిబ్బందితో కలిసి ఏనుగులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఏనుగులు ఎంతకీ బయటకు రాలేదు. దీంతో పొద్దు పోయేవరకు అధికారులు పగలంతా వాటి వద్దే కాపలా కాచారు. రాత్రి కావడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. పైగా వర్షం పడుతుండడంతో ఏనుగుల గుంపు పడమటి ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.


