4 టన్నులకు పర్మిట్.. 12 టన్నులకు రైట్‌రైట్
సాక్షి, టాస్క్‌ఫోర్సు : నగరి నియోజకవర్గంలోని విజయపురం మండలం మహరాజపురంలో క్వారీ యాజమాన్యం పని తీరు నిబంధనకు విరుద్ధంగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తమిళనాడులోని రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం ఓ ప్రైవేటు సంస్థ మహరాజపురం నుంచి మట్టి తరలింపునకు అనుమతి తీసుకుంది. జిల్లా అధికారుల నిబంధనల ప్రకారం ఒక ఇన్‌వాయిస్ బిల్లుతో 4 మెట్రిక్ టన్నులు తరలించాలి. అయితే 4 మెట్రిక్ టన్నులు ఉన్న ఇన్‌వాయిస్ బిల్లు పెట్టుకుని 12 మెట్రిక్ టన్నుల మట్టి తరలిస్తున్నారని స్థానికుల నుంచి అందిన సమాచారం. ఇన్‌వాయిస్ ఆధారంగా రెవెన్యూ అధికారులకు చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థ చేతిలో మహరాజపురం కొండ, గుట్టలు కరిగిపోతున్నాయని ఆరోపించారు.
పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు
భారీ వాహనం ద్వారా మట్టి తరలింపుతో విజయపురం–కనకమ్మసత్రం రోడ్డు పూర్తిగా దెబ్బతింటోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అడుగడుగునా తారు లేచిపోయి గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా గృహాలు ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో దుమ్ముధూళి ఎగసి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికై న జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
4 టన్నులకు పర్మిట్.. 12 టన్నులకు రైట్‌రైట్


