చిత్తూరు అర్బన్ : చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్య కేసులో దోషులకు విధించే శిక్షపై గురువారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ కేసులో మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ (చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ అనే అయిదుగురిని ఇప్పటికే న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కటారి దంపతుల హత్యలో అయిదుగురిపై నేరం రుజువైనట్లు ప్రకటించింది. కాగా దోషుల మానసిక పరిస్థితి, సామాజిక స్థితి, జైల్లో ప్రవర్తనపై ఆయా విభాగాల అధికారులు నివేదికలు ఇవ్వాలని చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదికలను న్యాయస్థానం ముందు ఉంచాలని, దోషులను శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే దోషులకు అన్ని పరీక్షలు పూర్తి చేసిన అధికారులు.. సీల్డు కవరులో నివేదికను న్యాయస్థానం ముందు ఉంచనున్నారు. నివేదిక చూసిన తరువాత న్యాయమూర్తి శిక్షపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక చిత్తూరు కోర్టు కాంప్లెక్సు వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.


