
చిత్తూరు మాజీ మేయర్ హత్య కేసులో రేపు తుది తీర్పు
నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో కటారి దంపతుల హత్య
21 మంది నిందితులు.. 122 మంది సాక్షులు, విచారణ పూర్తి
పదేళ్ల తరువాత వెలువడనున్న తీర్పు.. అంతటా ఉత్కంఠ
జిల్లా కోర్టు వద్ద 144 సెక్షన్.. చిత్తూరులో భారీ భద్రత
చిత్తూరు అర్బన్: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసుకు సంబంధించి మరో 24 గంటల్లో తీర్పు వెలువడనుంది. చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఈ కేసులో శుక్రవారం తీర్పు వెలువరించనుంది. దీంతో పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. మరోవైపు నిందితులు, బాధితుల్లో కోర్టు తీర్పుపై ఉత్కంఠత నెలకొంది.
పదేళ్ల కిందట రక్తపుటేర్లు..
2015 నవంబరు 17.. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రక్తపుటేర్లు పారాయి. ఓ వైపు తుపాకీ పేలుళ్లు.. మరోవైపు కత్తులతో స్వారీ. నాటి నగర ప్రథమ పౌరురాలైన కటారి అనురాధ మేయర్ స్థానంలో తన ఛాంబర్‌లో కూర్చుని ఉన్నారు. పక్కనే ఆమె భర్త కటారి మోహన్, ఇతర టీడీపీ నాయకులు ఉన్నారు. ముసుగు (బుర్కా) ధరించి వచ్చిన ఓ వ్యక్తితోపాటు మరికొందరు కూడా ముసుగులు ధరించి తుపాకులు, కత్తులతో ఛాంబర్‌లోకి చొరబడ్డారు. మేయర్ అనురాధను తుపాకీతో కాల్చగా.. తలను తీల్చుకుంటూ మెదడు చిట్లిపోయి ఆ బుల్లెట్ బయటకు వచ్చింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఆమె భర్త కటారి మోహన్‌ను కార్యాలయంలో కత్తులతో వేటాడి పాశవికంగా నరికి హతమార్చారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కటారి దంపతుల జంటహత్యలతో రక్తపుటేర్లు పారాయి. నాటి టీడీపీ ప్రభుత్వం హయంలో పోలీసుశాఖ వైఫల్యానికి.. రాష్ట్రంలో మహిళల భద్రతను ప్రశి్నస్తూ జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేరంలో మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా చూపించిన పోలీసులు.. హత్య కుట్రలో సంబంధం ఉందని 23 మంది చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.
భారీ భద్రత..
జంట హత్యల కేసుకు సంబంధించి మరో 24 గంటల్లో తీర్పు వెలువడనుండడంతో చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. న్యాయస్థానం ఏ తీర్పుఇచ్చినా.. కోర్టు ఆవరణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా బాంబు స్క్వాడ్, స్పెషల్ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే కోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక చిత్తూరు నగరంలో కూడా ఎక్కడా ఎలాంటి శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
నిందితులు వీరే..
అనురాధ, మోహన్ జంట హత్యల కేసులో తొలుత 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన కాసారం రమేష్ అనే వ్యక్తికి ఈ కేసులో సంబంధంలేదని న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చింది. ఇక మరో నిందితుడు శ్రీనివాస ఆచారి అనారోగ్యంతో కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. దీంతో నిందితులు 21 మందిగా మిగిలారు. చింటూ ప్రధాన నిందితుడిగా వెంకటాచలపతి, జయప్ర కాష్‌రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ మురుగన్, యోగానంద్, పరందామ, హరిదాస్, మొగిలి, శశిధర్, యోగానందం, ఆర్‌వీటీ బాబు, లోకేష్ రఘుపతి, నాగరాజు, ఆనంద్‌కుమార్, కమలాకర్, రజనీకాంత్, నరేంద్రబాబు, సురేష్ పేరిట పోలీసులు కోర్టులో నేరాభియోగపత్రం (ఛార్జ్‌షిట్) దాఖలు చేశారు. ఈ కేసులో దాదాపు 122 మంది వరకు సాక్షులుగా ఉన్నారు. కేసు మొత్తాన్ని విచారించిన చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా న్యాయస్థానం, మహిళలపై జరిగిన నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ఇన్‌చార్జ్ న్యాయమూర్తి ఎం.శ్రీనివాసరావు తీర్పు వెలువరించనున్నారు.