ఇసుక ధరలకు రెక్కలు
పలమనేరు : అదును చూసి పదును పెట్టడమంటే ఇదేనేమో..! ఇటీవల వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు ప్రవహిస్తున్నాయి. చెరువుల్లోనూ నీరు చేరింది. దీంతో జిల్లాలో ఇసుక తవ్వకాలు దాదాపుగా ఆగిపోయాయి. ఇలా డిమాండ్ వస్తుందని ముందుగానే భావించిన ఇసుక స్మగ్లర్లు వేలాది లోడ్ల ఇసుకను డంప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టిప్పర్ ఇసుక ధరను అమాంతం పెంచి చిత్తూరు ప్రాంతం నుంచి పలమనేరు , కుప్పం, ఇటు కర్ణాటకలోని హోస్‌కోటకు ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. బుధవారం గంగవరం పోలీసులు రికార్డుల్లేని ఓ ఇసుక టిప్పర్‌ను సీజ్ చేసి మైనింగ్, ఆర్టీవో అధికారులకు అప్పగించడంతో ఈ ఇసుక అక్రమ రవాణా బాగోతం వెలుగు చూసింది.
ముందస్తుగా ఇసుక నిల్వ చేసుకొని..
నదుల్లోంచి ఫిల్టర్ ఇసుక తప్ప ఎక్కడా ఇసుకను తోడేందుకు కష్టంగా మారింది. దీంతో ముందస్తుగా ఇసుకను డంప్ చేసుకున్న వారు మాత్రం ఇప్పుడు భారీ ధరలతో ఇసుక టిప్పర్ల ద్వారా కావాల్సిన చోటుకు తరలిస్తున్నారు. గంగాధర నెల్లూరు, చిత్తూరు, బంగారుపాళెం, గంగవరంలలో ఇసుక డంపులున్నట్లు తెలుస్తోంది. వీటిని బహిరంగంగానే వేసినా ప్రభుత్వ పనుల అవసరాల కోసమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ వీటి నుంచే ఇసుక కర్ణాటకకు తరలుతోందనే విషయం అధికారులకు తెలియందేమీకాదు.
ధరలు అమాంతం పెంచి..
వర్షాలతో ఇసుకకు నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో ఇసుక స్మగర్లు మొన్నటి దాకా టిప్పర్ ధర చిత్తూరు నుంచి పలమనేరుకు 20 వేలు, వీకోటకు రూ.23 వేలు, కుప్పానికి రూ.25 వేలు, కర్ణాటకకు రూ.90 వేలుగా ఉండేది. ఇప్పుడు పలమనేరుకు రూ.27 వేలు, వీకోటకు రూ.30 వేలు, కుప్పానికి రూ.35 వేలు, హొసకోటకు రూ.1.30 లక్షలకు పెంచేశారు. దీనికి తోడు డ్రైవర్ బత్తా రూ.500 అదనంగా ఇవ్వాల్సిందే.
కూటమి అండతో దర్జాగా ...
యథేచ్ఛగా అక్రమ రవాణా
బంగారుపాళెం నుంచి వీకోట వైపుగా వెళుతున్న ఇసుక టిప్పర్‌ను గంగవరం పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇరువురు కానిస్టేబుళ్లు దీన్ని తూకం వేసి ఆపై సంబంధిత శాఖలకు అప్పగించారు. ఇది వీకోటకు చెందిన ఓ వ్యక్తికి తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పాడు. అయితే ఇసుక ప్రభుత్వ పనుల కోసమని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగించారు. కానీ వాటికి సంబంధించిన ఎలాంటి రికార్డులు లేకపోవడంతోనే పోలీసులు సీజ్ చేసినట్లు తెలిసింది. పోలీసుల పట్టుకుంది ఓ టిప్పరైతే నిత్యం పదుల సంఖ్యలో ఇదే హైవేపై ఇసుక టిప్పర్లు యథేచ్ఛగా వెళుతుండడం గమనార్హం.
ప్రస్తుతం సాగుతున్న ఇసుక అక్రమ రవాణాలో చిత్తూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు, బంగారుపాళ్యానికి చెందిన ఓ టీడీపీ నేత, వీకోటకు చెందిన మరో వ్యక్తి ద్వారా ఇక్కడికి ఇసుక రవాణా అవుతున్నట్లు ఇక్కడి ఇసుక ఏజెంట్లే చెబుతున్నారు. ఇప్పుడు బంగారుపాళెం డంప్ నుంచి వీకోట దాకా ఇసుక సరఫరా అవుతోంది. ఈ ప్రాంతంతో పాటు పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో ఇసుక ఏజెంట్లున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


