సైబర్ నేరాలపై అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : ఉన్నతవిద్య చదివే విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన ముఖ్యమని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి విద్యార్థి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే ఆ సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. మొబైల్స్ రూపంలోనే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నట్లు చెప్పారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. మత్తు జీవితాన్ని నాశనం చేస్తుందన్న విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలన్నారు. సైబర్ నేరాలు నిత్యం పెరుగుతుండడంతో విద్యార్థులు జాగ్రత్తగా సామాజిక మాధ్యమాలను వినియోగించాలన్నారు. సంబంధం లేని లింక్‌లను క్లిక్ చేయకూడదన్నారు. మహిళల భద్రతకు అమలు చేస్తున్న శక్తి యాప్‌ను విద్యార్థినులు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. పీవీకేఎన్ ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. చిత్తూరు సర్కిల్ ఏసీబీ, విజిలెన్స్ సీఐ వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులకు వెల్లడించకూడదన్నారు. క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఫోన్‌లలో ఓటీపీలు, లింక్‌లు వస్తే వాటిని ఆమోదించకూడదన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ మహేశ్వర, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


