రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికలు
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఇటీవల రాజ్యాంగ నియమావళిని ఉల్లంఘిస్తూ నిర్వహించారని ఆ సంఘం సభ్యులే ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత, సమాన హక్కుల వంటి ప్రాథమిక సూత్రాలను గాలికొదిలేశారని సభ్యులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం నిష్పాక్షిక అధికారులను నియమించకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని వాపోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే అధికారులుగా నియమించడం చట్టవిరుద్ధమని చెబుతున్నారు. అర్హులైన లెక్చరర్‌లందరికీ సభ్యత్వం కల్పించకుండా, అనుకూలంగా ఉన్న వారికి మాత్రం అవకాశం కల్పించి ఎన్నికలు నిర్వహించారని వెల్లడిస్తున్నారు. ఇలా చేయడం సమానత్వ హక్కు (భారత రాజ్యాంగంలోని 14 వ అధికరణం) సమాజాల నమోదు చట్టంలోని నియమావళికి విరుద్ధమని లెక్చరర్‌లు వాపోతున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల కమిటీల ఎన్నికలు పూర్తి చేసి రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది, అలా చేయకుండానే ఎన్నికలు పూర్తి చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఎన్నికలు జరగకపోగా, 3 జిల్లాల్లో బహిష్కరించారని వెల్లడిస్తున్నారు. రాష్ట్ర రాజధాని కేంద్రంలో నిర్వహించాల్సిన ఎన్నికలను తమకు అనుకూలంగా తిరుపతిలో నిర్వహించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికలు


