మీ సంతకమే..మీ పిల్లల భవిష్యత్తు
కోటి సంతకాలతో కూటమిని నిలదీద్దాం
కూటమి విధానాలను ఎండగడదాం
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
మాజీ మంత్రి ఆర్కేరోజా పిలుపు
నగరి : మీ సంతకం మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని, కోటి సంతకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి ఆర్కేరోజా పిలుపునిచ్చారు. శనివారం తన నివాస కార్యాలయం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిమిత్తం నగరి మున్సిపల్, రూరల్ మండలం, వడమాలపేట మండల నేతలతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమవుతుందన్నారు. మెడికల్ కళాశాలలను రక్షించుకుంటేనే భవిష్యత్తులో పేద పిల్లలు డాక్టర్లవుతారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఆ సేవలు నిలిచిపోయే విధంగా చేశారని దుయ్యబట్టారు.
ఆయన నగరి ఎమ్మెల్యేనా,
తిరుపతి ఎమ్మెల్యేనా?
నగరిలో ఉన్నది నగరి ఎమ్మెల్యేనా, తిరుపతి ఎమ్మెల్యేలా..? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందని మాజీ మంత్రి ఆర్కే.రోజా ఎద్దేవా చేశారు. ఎవరి వద్ద ఎంత కమీషన్ తీసుకుందామా..? అని తిరుపతి నుంచి లెక్కలు వేసుకోవడం మినహా ఆయన ఏమీ చేయడం లేదన్నారు. ఆయన్ను ఎవరైనా కలవాలన్నా తిరుపతికి వెళ్లాల్సిందే అన్నారు. దోచుకున్నామా.. దాచుకున్నామా అన్నరీతిలో పాలన కొనసాగుతోందన్నారు. తాను ఏ అభివృద్ధి పనులు చేశానో ఎమ్మెల్యేగానీ ఆయన అనుచరుగానీ వస్తే కళ్లకు కట్టినట్టు చూపుతానన్నారు. వారు చేసిన అభివృద్ధి చూపగలరా అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఏదైనా కట్టించాడా అంటే అది ఆయన తండ్రి విగ్రహం మాత్రమే అన్నారు. పోటీపడి అభివృద్ధి చేసి ప్రజలకు మంచి చేయాలన్నారు. అది వదలిపెట్టి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడదామా, లోపలేద్దామా, లిటిగేషన్ పెడదామా అనే దిశగానే పాలన కొనసాగుతోందన్నారు. అనంతరం కోటిసంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు. నియోజకవర్గ పరిశీలకులు రాహుల్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, ఎంపీపీ భార్గవి, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.
సూపర్ మోసం
సూపర్ సిక్స్ సూపర్ ఫట్ అయ్యిందని మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోందని పేర్కొన్నారు. కొండలు, గుట్టలను వదిలిపెట్టడం లేదని, ఎడాపెడా దోచేస్తున్నారన్నారని ఆరోపించారు. మద్యం, గ్రావెల్, ఇసుకపై వచ్చే ఆదాయంపైనే దృష్టి పెడుతున్నారే తప్ప.. ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో పాలకులు లేరన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే వైఎస్సార్ సీపీ లక్ష్యమన్నారు. మెడికల్ కళాశాలల పీపీపీని వ్యతిరేకించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వ మెడలు వంచుదామన్నారు.
మీ సంతకమే..మీ పిల్లల భవిష్యత్తు


