అదనపు పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనంగా 203 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు డీఆర్‌వో మోహన్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లెయిమ్‌ల పరిష్కారం పకడ్బందీగా చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2026 ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్‌ల రేషనలైజేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,776 పోలింగ్‌స్టేషన్‌లు ఉండగా అందులో 8 పోలింగ్‌స్టేషన్‌లు పాత భవనాలు, కూలిపోయిన భవనాల నుంచి కొత్త వాటికి మార్పు చేశామన్నారు. మరో 68 పోలింగ్ స్టేషన్‌ల పేర్లను మార్పు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 1,500 మంది ఓటర్లకంటే ఎక్కువ ఉన్న పోలింగ్‌స్టేషన్‌ల పరిధిలో అదనంగా కొత్త పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశామన్నారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులతో చర్చించి జిల్లాలో 203 కొత్త పోలింగ్‌స్టేషన్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపి ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం జిల్లాలో కొత్త పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం 1,979 పోలింగ్‌స్టేషన్‌లు ఉంటాయన్నారు. జిల్లాలో 15,74,277 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,74,244 మంది పురుషులు, 7,99,961 మంది మహిళలు, 72 మంది ఇతరులు ఉన్నారన్నారు. ఆర్‌డీవోలు శ్రీనివాసులు, అనుపమ, భవానీ, శ్రీనివాస్‌రాజు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉదయ్‌కుమార్, సురేంద్రకుమార్, అట్లూరి శ్రీనివాసులు, పరదేశి, బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


