వ్యక్తి ఆత్మహత్య
పుంగనూరు: మండలంలోని మార్లపల్లెకి చెందిన మునిరత్నం (55) బుధవారం గ్రామానికి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. అటువైపుగా వెళుతున్న గొర్రెల కాపరులు సంఘటనను గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి వచ్చిన మునిరత్నం ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు తమ గతి ఏమిటని రోదిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి కారణాలపై విచారణ చేపట్టారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి
బంగారుపాళెం: మండలంలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందాయి. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని గుండ్లకట్టమంచి దళితవాడకు చెందిన రైతు మునిరాజులు ఉదయం తన మేకలను మేత కోసం అడవికి తోలుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి మేకలను తోలుకుని వస్తుండగా రోడ్డు దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
వైద్యురాలి నుంచి రూ.93 లక్షలు లూటీ
చిత్తూరు అర్బన్: తాము ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు అని చెప్పుకున్న నిందితులు.. ఓ వైద్యురాలి నుంచి రూ.93 లక్షలు కాజేశారు. ఆలస్యంగా మేల్కొన్న ఆమె బుధవారం రాత్రి చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. లావణ్య అనే వైద్యురాలు నగరంలోని మిట్టూరులో పోలీసు సంక్షేమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూ ఇక్కడే పనిచేస్తున్నారు. ఈఏడాది జూలై 2న గుర్తు తెలియని వ్యక్తులు వైద్యురాలికి వీడియో కాల్‌చేశారు. తాము కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులమని పరిచయం చేసుకున్నారు. ‘‘డాక్టర్‌గా మీరు ఎన్నో అక్రమాలు చేశారు. అందుకుగాను మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’’ అని చెప్పారు. దీంతో ఆమె భయపడిపోయారు. దీన్ని అలుసుగా తీసుకున్న నిందితులు ఏడు దపాలుగా ఆమె నుంచి రూ.93,13,852 నగదును ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీల ద్వారా కాజేశారు. ఆలస్యంగా తాను మోసపోయానని గుర్తించిన వైద్యురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు. చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


